Ganja: హైదరాబాద్ మహానగరాన్ని గంజాయి మత్తు పీడిస్తున్నది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలను కాపాడాలనుకుని వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు అదే మత్తులో తూగుతున్నారు. ఒకరో, ఇద్దరో కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో మెడికల్ విద్యార్థులు తాజాగా పట్టుబడటం కలకలం రేపుతున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
Ganja: గంజాయి విక్రయం కేసులో పోలీసులు ఇటీవల హైదరాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్‌కు చెందిన జరీనా బేగంను అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయి కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాల కోసం వారి ఫోన్లలోని కాల్‌డాటాను పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్మే వాస్తవం బయటపడింది. విద్యార్థుల పేర్లు బయటపడటంతో సంచలనం రేకెత్తిస్తున్నది.
Ganja: అర్ఫాత్ నుంచి మేడ్చల్ సమీపంలో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన 64 మంది విద్యార్థులు తరచూ గంజాయిని కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిలో 26 మంది మెడిసిటీ వైద్య కళాశాల విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 9 మంది మెడికోలకు పాజిటివ్ అని తేలడం గమనార్హం.
Ganja: ఇదిలా ఉండగా, ఆ మెడిసిటీ విద్యార్థుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా పోలీసులు గుర్తించారు. దీంతో పాజిటివ్ తేలిన వారందరినీ డీఎడిక్షన్ కేంద్రానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. గంజాయి కొనుగోలు చేస్తున్న వారి తల్లిదండ్రులు, మెడిసిటీ కళాశాల ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ సమక్షంలో ఈగల్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.