Free Bus: ఉచితమే కదా.. బస్సెక్కితే పోలా? అంటే పోయేదేముంది.. ఎక్కేద్దాం పదండి. అంటూ ముగ్గురూ పయనమై బస్సెక్కేశారు. తెలంగాణలో మహిళల కోసం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం.. ఇలాంటి చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వం సదుద్దేశంతో మహిళా సంక్షేమానికి తెచ్చిన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండగా, మరికొందరు సరదాకు వాడుకుంటున్నారు. ఇక్కడా ఇలాగే సరదా కోసం బస్సెక్కారు. కుటుంబ సభ్యులకు కన్నీటిని తెప్పించిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Free Bus: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బాలికల ఉన్నత పాఠశాల నుంచి శుక్రవారం ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. పత్రికల్లో వార్త అయి కూసుంది. వారంతా ఎక్కడికి వెళ్లారు? ఏమై ఉంటారు? ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు బాధ్యత లేదా? అంటూ ప్రశ్నల వర్షాలు కురిశాయి.
Free Bus: సీన్ కట్ చేస్తే ఇవ్వాళ శనివారం తేలింది ఏమిటంటే? బస్సెక్కితే పోలే? అని అనుకోవడమే ఇందుకు కారణమని తేలింది. స్కూల్‌కు డుమ్మా కొట్టి చక్కర్లు కొట్టేందుకు ఫ్రీ బస్సు ఎక్కి కూసున్నరు. ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని ఆ విద్యార్థినులు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ చుట్టేశారు. వీరి ఆచూకీ కోసం అటు పాఠశాల ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
Free Bus: ఇంతలో వారిలో ఒకరి వద్ద ఉన్న ఫోన్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేయడంతో విద్యార్థుల ఆచూకీని పసిగట్టారు. ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థులను పట్టుకొని బాలికల తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చూశారా? మహిళా సంక్షేమానికి ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఫ్రీ బస్సు పథకాన్ని ఎలా అభాసుపాలు చేస్తున్నారో?