Badileelu Eppudu Babu

Badileelu Eppudu Babu: ఈ గందరగోళమే దెబ్బతీస్తోందా?

Badileelu Eppudu Babu: ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయంటూ గత మూడు నెలలకు పైగా ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారం ప్రచారం గానే మిగిలిపోయింది తప్ప వాస్తవ రూపం మాత్రం దాల్చలేదు. గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం కొంతమంది అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టి మార్పులు చేర్పులు చేపట్టింది. అయితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. పాలనను మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో అధికారుల బదిలీలకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారంటూ 100 రోజులకు పైగా ఊహాగానాలు వినపడుతూనే ఉన్నాయి. ఈ ప్రచారంపై ఏపీ సచివాలయ వర్గాలతో పాటు రాష్ట్రంలో జిల్లా కేంద్రంగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలలో బలంగా చర్చ జరుగుతోంది. అయితే బదిలీలు అనేవి ప్రభుత్వంలో ఒక భాగం. దీనిపైన సాధారణంగా పెద్ద చర్చ ఉండదు. కానీ ఈసారి ఇన్ని నెలలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులు పాలన వ్యవస్థను దెబ్బతీసాయనే విమర్శ బలంగా వినిపిస్తోంది. రాజకీయ వర్గాల నుంచి కాకుండా ఈ విమర్శ అధికార వర్గాల నుంచి ఎక్కువ వినిపిస్తోంది. బదిలీలు చేయాలని అనుకుంటే ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తే సరిపోతుంది కదా… అని కొందరు సీనియర్ అధికారులు సైతం అంటున్నారు.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ముందుకు వెళుతున్న నేపథ్యంలో, తన పరిపాలనలో స్పీడ్ పెంచలనే ఆలోచనలో సీఎం కనిపిస్తున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం సీఎం ఎన్నిసార్లు చెప్పినా అనేక విషయాలలో మొద్దు నిద్రను వీడటం లేదు. పాలనా పరంగా చాలా మంది ఉన్నతాధికారులు సీఎం సీరియస్‌గా తీసుకున్న నిర్ణయాలపై కూడా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. అయితే అధికారుల వ్యవహారాలపై సీఎం సీరియస్‌గా దృష్టి పెట్టలేదనే వారు సైతం ఎక్కువగానే కనిపిస్తున్నారు. బదిలీల పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్ర పరిపాలనపైనా కనిపిస్తున్నాయని కూటమిలోని సీనియర్ నాయకులు వాపోతున్నారు. జిల్లాలలో కీలకంగా పనిచేయాల్సిన సానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయితే… తమకు ఎలాగో బదిలీ ఉండబోతోంది కదా అన్న ఆలోచనతో ఏ పనినీ సీరియస్‌గా చేపట్టడం లేదన్న వాదన వారు వినిపిస్తున్నారు. ఇక దీనికి తోడు సచివాలయం కేంద్రంగా ఉండే అనేకమంది ఉన్నతాధికారుల విషయంలోనూ ఇదే పరిస్థితి, పరిణామాలు కనిపిస్తున్నాయి. జగన్ జమానాలో కీలక బాధ్యతలు వెలగబెట్టిన అనేకమంది ఉన్నతాధికారులు ఇంకా అక్కడే ఉండి పనిచేస్తున్నారు. వారికి జగన్ పైన స్వామి భక్తి తగ్గలేదనేది సచివాలయ వర్గాల వాదన. సొంత ఎజెండాతో కొందరు ఉన్నతాధికారులు గత ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికీ మేలు చేస్తున్న అనేక సంగతులు ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లాయి. అయినా అలాంటి అంశాలపై ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు కదా అనేది కొందరి వాదన. పాలనలో వేగం పెంచి పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలని సీఎం భావిస్తున్నా.. ఆ నిర్ణయం అనుకున్న విధంగా అమలు కావడం లేదని విమర్శలే వ్యక్తమౌతున్నాయి.

ALSO READ  Waste Tax Cancel: చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

Also Read: Vadodara Bridge Collapse: గుజ‌రాత్ వంతెన కూలిన ఘ‌ట‌న‌లో 20కి చేరిన మృతుల సంఖ్య‌

Badileelu Eppudu Babu: ఇక కొన్ని జిల్లాలలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు.. ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులకు కూడా తెలియకుండానే పరిపాలన వ్యవహారాలు చక్కబేట్టేస్తున్నారట. అంతేకాదు.. మంత్రులు చెప్పే పనులు చేయకపోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో లెక్కలేని విధంగా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శలు బలంగా ఉన్నాయి. అందులోనూ… ఫస్ట్‌టైమ్‌ మంత్రులుగా చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉందట. జిల్లా కలెక్టర్లు అసలు తమని మంత్రులుగానే గుర్తించడం లేదని వాపోతున్నారట. కనీస సమాచారం గానీ, కనీస ప్రాధాన్యత గాని అమాత్యులకు అక్కడ లభించడం లేదట. జరుగుతున్న కష్టాన్ని, నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక… పరువు పోతుందని గుట్టుగా నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్ గారు.. తనకు ఎలాగో బదిలీ ఖాయం అని భావించి, భారీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చుకునేందుకు, తన చేతులకు మట్టి అంటకుండా చూసుకుని, పెద్ద వ్యవహారమే నడిపారట. సంబంధిత మంత్రితో సంతకం పెట్టించుకొచ్చేయండి… మిగిలిన పని నేను చేస్తానని సదరు కలెక్టర్ గారు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సంబంధిత మంత్రి గారు ముందుగానే తేరుకోవడంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిందట. ఉత్తరాంధ్రకు చెందిన మరో కలెక్టర్ గారు అన్నీ ఆయనై నడిపిస్తున్నారట. బదిలీల్లో ఆయన పేరు ప్రముఖంగానే వినిపిస్తోంది. అమరావతికి సమీపంగా ఉన్న ఓ కలెక్టర్ అయితే.. నిత్యం భూ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారట. అదే రాజధాని సమీపంలో ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు.. ఎప్పుడు బదిలీలు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారట. రాయలసీమ జిల్లాల్లోని పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు… అధికార పార్టీ నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఏపీ సచివాలయ కేంద్రంగా పనిచేసే కొందరు ఉన్నతాధికారుల వ్యవహారం అయితే చెప్పాల్సిన అవసరం లేదనే విధంగా తయారైందట. ఐదేళ్ల ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసిపోయిందిలే, ఇంకెంత నాలుగేళ్లే… అనే విధంగా వారి వ్యవహారం సాగుతుందట. ప్రభుత్వ పెద్దలను ఏకవచనంతో సైతం సంబోధిస్తున్నారట. అంతే కాకుండా.. ఎంతమందిని చూడలేదు, ఎన్ని చూడలేదు అంటూ కబుర్లు చెప్పుకుంటున్నారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో సాగుతోంది.

డ్‌ వాయిస్ -అయితే దీనికంతటికీ కారణం, ప్రభుత్వం బదిలీల పేరుతో కాలయాపన చేయటమే అనేది ప్రధాన వినిపిస్తున్న వాదన. అసలు బదిలీల విషయం ఎందుకు ఈ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది? దీని వల్ల పరిపాలన ఎంత ప్రభావితమవుతోంది? అనేదానిపైన ఇకనైనా సర్కార్ పెద్దలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ALSO READ  Guntur Varasula Politics: వైసీపీ సంక్షోభం నుండి పుట్టుకొచ్చిన కొత్త నాయకత్వం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *