Kishan Reddy: తెలంగాణ బీజేపీ నేతల భిన్నాభిప్రాయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి… ఇకపై పార్టీ శాసనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. పార్టీ విధానాలకు అనుగుణంగా మాట్లాడటమే కాకుండా, ప్రెస్ మీట్లు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిన కిషన్ రెడ్డి… “పార్టీ నాయకులు ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలతో మాట్లాడటం, ఒకే అంశంపై విభిన్న ప్రకటనలు ఇవ్వడం జాతీయ నాయకత్వ దృష్టికి వెళ్లింది. ఇది పార్టీకి ప్రతిష్టహానికరం,” అని పేర్కొన్నారు.
ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన విచారణ, ఈటల రాజేందర్‌కు జారీ అయిన నోటీసులపై బీజేపీ నేతల అభిప్రాయ భిన్నతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై ఎంపీ రఘునందన్ రావు ‘కవిత కొత్త పార్టీ పెడతారు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ఆమె కాంగ్రెస్‌లో చేరతారని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: June 1st Rules: బ్యాంకింగ్ నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు.. జూన్ 1 నుంచి మారనున్న నిబంధనలు ఇవే
ఈ నేపథ్యంలో బుధవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కిషన్ రెడ్డి స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. “పార్టీ కార్యాలయాన్ని కొంతమంది వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి కార్యకలాపాలకు ఇకపై ఊరించబోమని” ఆయన స్పష్టం చేశారు.
పార్టీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ కూడా ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. “తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పనిచేస్తోందా లేదా?” అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, జనవరి 31న ఆర్థికశాఖపై దాఖలైన 27 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాకపోవడాన్ని she కీలకంగా ఎత్తిచూపారు. “కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని, వారి పాలనలో అమలు చేయకూడదనే నిబంధన ఏమైనా ఉందా?” అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
కిషన్ రెడ్డి నేతలంతా హుందాగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచిస్తూ… “బీజేపీ అనే పేరు సామాజిక బాధ్యతకు ప్రతీక. అందుకే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. అనవసరమైన వివాదాలతో పార్టీ పేరు చెడేలా చేయకూడదు. గీత దాటితే మేము కఠిన చర్యలు తీసుకోకతప్పం” అని గట్టిగా హెచ్చరించారు.