Putin-kim: ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశం ఆగస్టు 15న అలాస్కాలో జరగనుంది. ఈ భేటీకి ముందు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ట్రంప్‌తో జరగబోయే సమావేశానికి ముందు, పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ నేతలు నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యానికి మద్దతుగా సైనికులను పంపినందుకు పుతిన్ కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను ఆయన ప్రశంసించారు. అలాగే, కుర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో వారి సహకారం చాలా ఉందని పేర్కొన్నారు. ట్రంప్‌తో భేటీకి సంబంధించిన వివరాలను కూడా పుతిన్ కిమ్‌కు వివరించినట్లు రష్యా మీడియా తెలిపింది.
రష్యా, ఉత్తర కొరియా ఇటీవల కాలంలో తమ సంబంధాలను బాగా పటిష్టం చేసుకున్నాయి. గత ఏడాది ఇరు దేశాల మధ్య ఒక కీలక రక్షణ ఒప్పందం కూడా కుదిరింది.
Also Read: Kim Kardashian: కిమ్ కర్దాషియన్ విడాకుల సంచలనం.. షాకిస్తున్న కారణం?
ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో పుతిన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న దొనెట్స్క్ ప్రాంతంలోని మిగిలిన 30% భూభాగాన్ని తమకు అప్పగించాలని ఆయన ప్రతిపాదించారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రాంతాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, అలా చేయడం భవిష్యత్తులో రష్యా దాడులకు కీలకమైన మైదానంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ తమ దేశంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు.
ట్రంప్, పుతిన్ భేటీకి ముందుగానే ట్రంప్‌తో మాట్లాడాలని జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు. అలాస్కా సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందం ఖచ్చితంగా కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి కూడా ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ఈ ప్రకటనపై కూడా జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ దేశ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్చలను ఆమోదించబోమని తేల్చి చెప్పారు.