Fake DSP: ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ వ్యక్తి నకిలీ పోలీస్ అవతారమెత్తి 15 ఏండ్లు అయింది. రెండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ ఎందరో నిరుద్యోగ యువతీ, యువతులను మోసగిస్తూ నిరాటంకంగా అందినకాడికి దండుకుంటూ మోసగిస్తూ వస్తున్నాడు. ఏకంగా డీఎస్పీ అవతారం ఎత్తి మరింత మోసాలకు పాల్పడుతూ ఓ హోటల్‌లో తిష్టవేశాడు. అతని బాగోతంపై అనుమానం వచ్చిన కొందరు ఇచ్చిన సమాచారంతో సూర్యాపేట పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీస్ కావాలని కోరిక..
Fake DSP: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస్‌రావు పోలీస్ కావాలని చిన్ననాడే కోరుకున్నాడు. పదో తరగతి తప్పడంతో తనకోరిక నెరవేరలేదు. దీంతో ఆనాటి నుంచి వక్రమార్గం పట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. 15 ఏండ్ల క్రితం పోలీస్ యూనిఫాం ధరించి మట్టపల్లి శివారులోనే లారీ డ్రైవర్లను ఆపి అక్రమంగా డబ్బులు వసూలుకు పాల్పడ్డాడు. అతను నకిలీ పోలీస్ అని తెలియడంతో డ్రైవర్లంతా కలిసి చితకబాదారు.
ఏపీకి మారిన మకాం
Fake DSP: ఆ ఘటనతో బత్తుల శ్రీనివాస్‌రావు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొత్త అవతారం ఎత్తాడు. పోలీస్ అధికారిలా యూనిఫాం, బెల్ట్, బూట్లు, బ్యాడ్జీలు ధరించి డీఎస్పీనంటూ కారులో తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నాడు. ఆటో డ్రైవర్లు, కటింగ్ షాపుల యజమానులతో పరిచయం పెంచుకొన్నాడు. వీరి ద్వారా పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి లక్షల్లో వసూలు చేస్తూ వచ్చాడు.
2022లో అరెస్టు.. విడుదల
Fake DSP: ఈ దశలో బత్తుల శ్రీనివాస్‌రావు ఆంధ్రప్రదేశ్‌లోని నర్సరావుపేట రూరల్, మార్కాపురం, రాజమండ్రి, త్రిపురాంతకం, మేడికొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు నిరుద్యోగుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. ఈ నేపథ్యంలో పలువురు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల్లో 2022లో జైలుకు వెళ్లి అదే ఏడాది బెయిల్‌పై విడుదలయ్యాడు.
అక్రమ సొమ్ముతో జల్సాలు
Fake DSP: ఈ క్రమంలోనే బత్తుల శ్రీనివాస్‌రావు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఓ యువతి నుంచి రూ.36 లక్షలు వసూలు చేశాడు. ఏపీలోని మార్టూరు, గురజాలకు చెందిన ఇద్దరు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేశాడు. అమాయకుల నుంచి వసూలు చేసి అక్రమ సొమ్ముతో లగ్జరీ కార్లను కిరాయికి తీసుకొని తిరుగుతూ జల్సాలకు మరిగాడు.
సూర్యాపేటలో బాగోతం బట్టబయలు
Fake DSP: గత ఫిబ్రవరి నెలలో సూర్యాపేట సమీపంలో జరిగిన దురాజ్‌పల్లి జాతర సమయంలో మనోడు ఓ ప్లాన్ వేశాడు. తాను డీఎస్పీనంటూ, జాతర బందోబస్తు పర్యవేక్షణ డ్యూటీపై వచ్చానంటూ సూర్యాపేటలోని శ్రీగ్రాండ్ హోట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. నిత్యం పోలీస్ యూనిఫాంతో బయటకు వెళ్లి వస్తుండేవాడు. రెండువారాలపాటు ఆయన వ్యవహారం బాగానే సాగింది. అయితే ఇటీవల కొందరు హోటల్ వద్దకు వచ్చి బత్తుల శ్రీనివాస్‌రావుతో తరచూ గొడవ పడుతుండేవారు.
Fake DSP: హోటల్‌లో ఉన్న బత్తుల శ్రీనివాస్‌రావుతో వరుసగా మూడురోజులపాటు గొడవు జరగడంతో ఆ హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులకు ఉప్పందించారు. హోటల్‌కు వచ్చిన పోలీసులకు శ్రీనివాస్‌రావు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఈలోగా హోటల్ వద్దకు వచ్చిన బాధితులను విచారించగా, నకిలీ డీఎస్పీగా చెలామణి అవుతున్న మనోడి అసలు బాగోతం బట్టబయలైంది.
Fake DSP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూతు చేసి నకిలీ డీఎస్పీ అవతారమెత్తిన శ్రీనివాస్‌రావును కోదాడ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.18 లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట పోలీసులు తెలిపారు.