Narayana Swami Approval: కళత్తూరు నారాయణ స్వామి. జగన్ హయాంలో ఆయన ఐదేళ్లు ఎక్సైజ్ మంత్రి. ఉప ముఖ్యమంత్రి కూడా. కానీ వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో ఆయనపై ఒక్కటంటే ఒక్క ఆరోపణా రాలేదు. ఆయన ఒక్క రూపాయి తిన్నట్లు ఎక్కడా ఫ్రూఫ్ లేదు. ఎందుకంటే పాపం ఆయన ఎక్కడా ఒక్క రూపాయి వెనకేసుకుంది లేదు మరి. అందుకే గత కొద్ది నెలలుగా విచారణ జరుగుతున్నా సిట్ ఆయన్ని పిలవలేదు. ప్రజలకు కూడా ఆయనపై ఎలాంటి అనుమానాలు లేవు. ఒక దళితుడిని పేరుకు ఉప ముఖ్యమంత్రిని చేసి, తోలు బొమ్మలా ఆడించి, ఆయన్నే ముందుపెట్టి, వేల కోట్ల అవినీతికి పాల్పడి, బ్యాంకు లాకర్లు, బీరువాలు నింపుకున్నా కూడా… ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే.. అదీ జగన్ గొప్పతనమంటే. నారాయణ స్వామి ఒక్కడే కాదు.. జగన్ హయాంలో కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్న దళిత నేతలు ఏ ఒక్కరు కూడా బావుకుంది ఏమీ లేదు. జగన్ పాలనలో వారంతా ఉత్సవ విగ్రహాలే. ఇంత మంది దళితులకు మంత్రి పదవులిచ్చాం, ఉప ముఖ్యమంత్రుల్ని చేశాం అంటూ… నంబర్ చూపించుకోవడానికే దళిత నేతలకు పదవులిచ్చారు జగన్ రెడ్డి. వారిని ముందుపెట్టి వ్యవహారాలన్నీ నడిపించేది జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన సొంత మనుషులే.
ఆటలో అరటిపండు కాబట్టి నారాయణ స్వామి సేఫ్ అనుకున్నారు అంతా మొన్నటిదాకా. కానీ అనూహ్యంగా ఆయనకు సిట్ నుండి పిలుపొచ్చింది. 75 ఏళ్ల వయసులో ఎదురైన ఈ పరిస్థితులు ఆయన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయట. గత సోమవారమే ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, వైద్య కారణాలను చూపుతూ తప్పించుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, సిట్ తిరుపతిలోని ఆయన నివాసానికి ఒక ఇన్‌స్పెక్టర్‌ను పంపించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాథమిక దర్యాప్తు నిర్వహించింది. ఆ తర్వాత ఓ టీవీ చానల్ ఆయన్ని ఇంటర్వూ చేయగా, ఆయన భయం భయంగానే సమాధానాలు చెప్పారు. ఇంటర్వూలో పొరపాటున నోరు జారితే… సిట్ ఎక్కడ విచారణకు పిలుస్తుందోనని, లేదంటే ప్యాలస్ నుండి చీవాట్లు పడతాయేమో అని… తడుముకుంటూనేసమాధానాలు చెప్పారు. దీన్ని బట్టి ఆయన విచారణ ఎదుర్కొనేందుకే భయపడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read: Cm ramesh: కేటీఆర్‌పై సీఎం రమేష్ ఫైర్: బీజేపీ-టీడీపీ పొత్తుతో బీఆర్‌ఎస్ భయపడుతోంది!
సిట్ తనని విచారణకు పిలవకుండా వదిలేస్తే బాగుండని నారాయణస్వామి అందరు దేవుళ్లకు మొక్కుతున్నారట కూడా. ఎందుకంటే విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ఆయనకు ఉన్నది రెండే మార్గాలున్నాయి. ఒకటి, అప్రూవర్‌గా మారి లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలిసినవన్నీ చెప్పేయాలి.. రెండోది, ఇతర నిందితులతో పాటూ తానూ శిక్ష అనుభవించాలి. ఎందుకంటే వైసీపీ ఆయన్ను ఎంత అమాయకుడిని చేసి ఆడించిందనుకున్నా.. మంత్రిగా ఆయనకు తెలీకుండా ఏ ఫైలు ముందుకు కదిలే పరిస్థితి ఉండదు. ఒక వేళ టైమ్ బాగోలేక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే.. ఈ వయసులో తాను ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడలేననీ, అందుకే అప్రూవర్‌గా మారడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతానికి మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి వైసీపీ పాటే పాడుతున్నారు. అసలు స్కామే జరగలేదని, ప్రయివేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు ఇస్తే స్కాము అవుతుంది కానీ, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే స్కాము జరిగేందుకు ఆష్కారమెక్కడిదని… చిలుక పలుకులు పలుకుతున్నారు. కానీ ఆ వాదన నిలబడదని, సిట్ దగ్గర ఉన్న ఆధారాల ముందు ఈ డొల్ల వాదన చేయలేమని ఆయనకు బాగా తెలుసు. అందుకే నారాయణ స్వామి అప్రూవర్‌గా మారడానికే ఎక్కువ అవకాశాలున్నాయి అంటున్నారు పరిశీలకులు. తాను ఒక్క రూపాయి తినలేదు కాబట్టి.. అప్రూవర్‌గా మారితే సేఫ్‌గా బయటపడొచ్చని ఆలోచిస్తున్నారట. అదే వైసీపీ వైపు నిలబడితే… మంత్రిగా ఆయన ప్రమేయం లేకుండా ఆయన శాఖలో ఇంత భారీ స్కామ్ జరగడం అసాధ్యం అనే సింగిల్ రీజన్‌తో ఆయన్ని నిందితుల లిస్టులో చేర్చేస్తారు. తాను రూపాయి తినకపోయినా సరే… వేల కోట్లు మింగేసిన వారికి సహకరించారన్న అభియోగం ఆయనపై నమోదవుతుంది. ఇలా ఇప్పుడు మంత్రి నారాయణ స్వామి భవితవ్యం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. దీని నుండి ఆయన ఎలా భయటపడతారో వేచి చూడాలి.