Koun Banega Telangana CS: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పలువురు సీనియర్ ఐఏఎస్‌లు పోటీ పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో, అంటే ఈ నెల ఏప్రిల్ 30న, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎస్ రేసులో 1991 బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు, 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్ ముందువరుసలో ఉన్నట్టుగా సమాచారం. ఈయనతో పాటు 1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్ రంజన్, 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్, 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజూ, 1994 బ్యాచ్‌కు చెందిన సబ్యసాచి ఘోష్, 1991 బ్యాచ్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌లు పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. అయితే 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ఆగస్టులో రిటైర్‌మెంట్ కానుండగా, ఆయన చివరి ప్రయత్నంగా ఈ పోస్టు కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈయన పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. ముందు వరుసలో మాత్రం కె.రామకృష్ణారావు, వికాస్ రాజ్ పేర్లు వినబడుతున్నాయి.
రామకృష్ణ రావు గడిచిన పదేళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక శాఖకు రామకృష్ణరావునే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి కురుకుపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామకృష్ణ రావు తీసుకున్న నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమీషన్ కూడా రామకృష్ణరావు విచారణ సందర్భంగా నిధుల విడుదల, ఖర్చు విషయంలో ఆయన నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. సీఎస్ రేసులో ఉన్న కొద్దిమంది ఐఏఎస్‌లపై పోలీసు కేసులు ఉండగా, మరికొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలను గుర్తించి, అందర్నీ సమన్వయం చేసుకుంటూ పనిచేసే వారికే సీఎస్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Bomb Threat: తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
Koun Banega Telangana CS: రామకృష్ణారావు వైపే క్యాబినెట్ మంత్రుల్లో ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పైగా ఢిల్లీ, బెంగళూరు పరిచయాలు కూడా ఆయనకు అనుకూలం కానున్నట్లు చర్చ జరుగుతోంది. మూడు నెలల పదవీకాలం ఉన్న ఆయన సర్వీసును.. మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విధేయుడుగా పేరున్న సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్‌కు పదవి వరించనున్నదని టాక్ నడుస్తోంది. జయేశ్ రంజన్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నా, రామకృష్ణారావు, వికాస్ రాజ్‌ల పేర్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముందుగా రామకృష్ణారావుకు, తర్వాత వికాస్ రాజ్‌కు చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి మదిలో ఎవరు ఉన్నారో, వారికే పదవి దక్కుతుందని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే అన్ని రకాల ఈక్వేషన్స్ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మదిలో పేరు బయటకు రావాలంటే, కొత్త సీఎస్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడాలంటే, మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.