AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదనంగా, జలవనరుల శాఖకు సంబంధించిన 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ప్రధాన నిర్ణయాలు
సర్క్యులర్ ఎకానమీ – వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యర్థాలను వనరులుగా మలచి “చెత్త నుంచి సంపద” సృష్టించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
దీని ద్వారా MSME పరిశ్రమలకు కొత్త అవకాశాలు, స్థానిక స్థాయిలో ఉద్యోగాలు ఏర్పడతాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలు ఆమోదం పొందాయి.
టూరిజం అభివృద్ధితోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
అధికారిక భాష కమిషన్ పేరు మార్పుకు ఆమోదం.
ఇకపై ఇది “మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష సంఘం”గా కొనసాగనుంది.
నాలా చట్ట సవరణలకు గ్రీన్ సిగ్నల్.
సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేలా సవరణలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నారు.
సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపులు కూడా కేబినెట్ ఆమోదం పొందాయి.
మంత్రి కొలుసు పార్థసారథి వివరాలు
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలియజేస్తూ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ –
“రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతోపాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రాజధాని అభివృద్ధి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానంతో స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.