Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ జలవనరుల భద్రతా సంస్థ (NDSA) నివేదిక విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. NDSA నివేదికపై పూర్తి అధ్యయనం చేసి, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం కాదని, కొంతమంది జేబులు నింపుకోవడానికే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇది ఎవరి అయ్య జాగీరు కాదని గుర్తుంచుకోవాలి. అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారు,” అని మంత్రి విమర్శించారు.
“ఈ ప్రాజెక్టును మీరు డిజైన్ చేశారు, మీరు కట్టారు. ఇప్పుడు NDSA నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కనీసం సిగ్గుపడాలి,” అని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల వంటి ప్రాజెక్టులు పూర్తిగా నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు.
అయినా కూడా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండించామని చెబుతూ, నిజానికి రైతులకే నష్టం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.