Beggar: ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద నగరం అలాగే రాష్ట్ర వాణిజ్య రాజధాని. ఇక్కడ జనవరి 1, 2025 నుండి భిక్షాటన నిషేధించారు. దీంతో ఇండోర్ జిల్లా యంత్రాంగం యాచకులు, భిక్షాటన చేసే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో సహా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని ప్రకటించింది. ఈక్రమంలో బిచ్చగాళ్లు కనిపిస్తే వారికి ఈ విషయాన్ని తెలియచేస్తూ వస్తున్నారు అధికారులు. తాజాగా ఇండోర్‌లో ఓ బిచ్చగత్తె కనిపించడంతో ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె వద్ద దొరికిన డబ్బు చూసి అధికారులు అవాక్కయ్యారు.
ఇండోర్ హైకోర్టుకు కొద్ది దూరంలో ఉన్న మసీదు వెలుపల భిక్షాటన చేస్తున్న ఒక మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ప్లాస్టిక్ బ్యాగ్‌ని తనిఖీ చేశారు. ఈ భిక్షగత్తె సంచిలో సుమారు 30-40 పర్సులు, అందులో సుమారు రూ.75 వేలు లభ్యమయ్యాయి. అందులో ఉన్న వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బిచ్చగత్తె చాలా కాలంగా మసీదు దగ్గర భిక్షాటన చేస్తున్నట్లు తెలిసింది. తర్వాత ఆమెను అక్కడి నుంచి ఉజ్జయినిలోని ఆశ్రమానికి తరలించారు.
ఇది కూడా చదవండి: ISRO SpadeX Mission: ఇస్రో కొత్త మిషన్.. బుల్లెట్ కంటే వేగంగా స్పేస్ షిప్స్ డాకింగ్.. ఎలా చేస్తారంటే..
మహిళతో పాటు మరో యాచకుడిని అదుపులోకి తీసుకున్న ప్రభుత్వ బృందం అతడి నుంచి రూ.20 వేలు స్వాధీనం చేసుకుంది. తాను భిక్షాటన చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రోజూ ఇండోర్‌కు వచ్చేవాడినని ఆ బిచ్చగాడు అంగీకరించాడు. జనవరి 1 తర్వాత నగరంలో ఎవరైనా భిక్షాటన చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.