Nepal Protest

Nepal Protest: రంగంలోకి దిగిన మిలిటరీ.. ముగ్గురు మృతి.. 15,000 మందికి పైగా ఖైదీలు జంప్..

Nepal Protest: నేపాల్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల ప్రభావం ఇప్పుడు జైళ్లలోనూ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం నుండి ప్రారంభమైన అల్లర్లతో పాటు, దేశవ్యాప్తంగా అనేక జైళ్ళలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఖైదీలు భారీగా పారిపోతున్నారు.

గురువారం ఉదయం మాధేష్ ప్రావిన్స్‌లోని రామెచాప్ జిల్లా జైలులో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఖైదీలు గ్యాస్ సిలిండర్‌తో పేలుడు సృష్టించి బయటపడేందుకు ప్రయత్నించగా, భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఇది వరకూ మంగళవారం నుండి జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది ఖైదీలు మరణించారని పోలీసులు ధృవీకరించారు. వీరిలో ఐదుగురు బాంకేలోని నౌబాస్తా జువెనైల్ కరెక్షనల్ హోమ్‌లో జరిగిన ఘర్షణల్లో మృతి చెందారు.

15,000 మందికి పైగా ఖైదీలు పరారీ

ప్రాథమిక లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 25కి పైగా జైళ్ల నుండి 15,000 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తిరిగి వచ్చారని, కొందరిని మళ్లీ అరెస్టు చేసినట్లు ఖాట్మండు పోస్ట్ నివేదిక తెలిపింది.

కాస్కి జిల్లా జైలులో మాత్రమే 773 మంది తప్పించుకున్నారని, వారిలో 13 మంది భారతీయులు, మరో నలుగురు విదేశీయులు ఉన్నారని జైలర్ రాజేంద్ర శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: C P Radhakrishnan: గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీపీ రాధాకృష్ణన్‌

ప్రధాన జైళ్ళలో జైలు బ్రేక్

  • ఖాట్మండు వ్యాలీ సెంట్రల్ జైలు – 3,300 మంది

  • లలిత్‌పూర్ నక్కు జైలు – 1,400 మంది

  • దిల్లిబజార్ జైలు – 1,100 మంది

  • బాంకే జిల్లా జైలు – 436 మంది

  • మహోత్తరీ జలేశ్వర్ జైలు – 575 మంది

  • సున్సారి జుమ్కా జైలు – 1,575 మంది

  • చిత్వాన్ – 700 మంది

  • కైలాలి – 612 మంది

  • కంచన్‌పూర్ – 478 మంది

ప్రభుత్వంపై ఒత్తిడి

మంగళవారం హింస చెలరేగిన వెంటనే ప్రధాన మంత్రి కె.పి.శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. జనరల్ జెడ్ గ్రూప్ నేతృత్వంలోని నిరసనలతో దేశవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పడంతో నేపాల్ ఆర్మీ ఆంక్షలు విధించింది.

జైళ్ళను మళ్లీ అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసులు దేశవ్యాప్తంగా మోహరించబడ్డారు. “తప్పించుకున్న వారిని తిరిగి పట్టుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నాం” అని జైలు విభాగ డైరెక్టర్ జనరల్ లీలా ప్రసాద్ శర్మ తెలిపారు.

భారత సరిహద్దు దాకా పరారీ

రౌతహత్ జిల్లాలోని గౌర్ జైలును బద్దలు కొట్టిన వందలాది మంది ఖైదీలు భారత్ వైపు పారిపోయినట్లు సమాచారం. వారిలో కొందరిని భారత దళాలు అదుపులోకి తీసుకుని, తగిన ప్రక్రియ తర్వాత నేపాల్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ  Pawan Kalyan: హోమ్ మినిస్టర్ అనితకు పవన్ మాస్ వార్నింగ్

ప్రస్తుతం ఇంకా 216 మంది ఖైదీలు పరారీలో ఉన్నారు, వీరిలో చాలా మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుదారులుగా గుర్తించబడ్డారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *