DK Aruna: భాజపా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 56లో ఉన్న ఆమె నివాసంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది.
సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం, దుండగుడు చేతులకు గ్లౌజులు ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్లు రికార్డయింది. ఇంట్లోకి అతను వంటగది కిటికీ ద్వారా ప్రవేశించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇంట్లో ఎలాంటి వస్తువులు పోయినట్టు సమాచారం లేదు.
Also Read: Jagga reddy: జగ్గారెడ్డి చిట్‌చాట్ – రాజకీయాలపై కొత్త దృష్టికోణం, సినిమాకి ప్రాధాన్యం
DK Aruna: ఈ ఘటనకు సంబంధించి డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ స్పందిస్తూ, “అదే సమయంలో ఇంట్లో శబ్దం వచ్చిందని గుర్తించాం, కానీ ఎవరూ కనిపించలేదు. వంటగదిలో పాదముద్రలు కనిపించాయి. ఫుటేజ్‌లో ఆగంతకుడు ఎంపీ గది వరకు వెళ్లినట్టు ఉంది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో డీకే అరుణ గారు ఇంట్లో లేరు. ఆమె మహబూబ్‌నగర్‌లో సమావేశానికి హాజరయ్యారు” అని తెలిపారు.
జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.