Telangana High Court: ఇటీవల రామంతాపూర్‌లో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో, విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ కేబుల్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రామంతాపూర్ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించడం పట్ల న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, పుట్టినరోజున కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు తన తండ్రికి తలకొరివి పెట్టాల్సి రావడం తనను కలిచివేసిందని జస్టిస్ నగేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించిన జడ్జి, ఎవరికి వారు బాధ్యతను తప్పించుకోవడం సరికాదని పేర్కొన్నారు.
Also Read: High court: కేబుళ్లు వెంటనే తొలగించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం
లైసెన్స్ ఉన్న కేబుల్స్ తప్ప విద్యుత్ స్తంభాలపై మరే ఇతర కేబుల్స్ ఉండకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయని పిటిషనర్లు వాదించగా, దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగుల జేబులు మామూళ్ళతో బరువెక్కిపోతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, స్తంభాలపై ఉన్న అన్ని వైర్లు నల్లగా ఉన్నందున వాటిని గుర్తించలేకపోయామన్న వాదనను జడ్జి ఖండించారు. “కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారు” అంటూ చురకలు అంటించారు.
చలనరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలం? అని ప్రశ్నించిన జస్టిస్ నగేష్ భీమపాక, చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయడం కష్టమని, సులభంగా ఉంటే ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఒకరినొకరు నిందించుకోవడం మానుకోవాలని సూచించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.