Simhachalam: విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఈ సంవత్సరం జరగాల్సిన చందనోత్సవం సందర్భంగా ఘోర విషాదానికి వేదికైంది. భక్తుల తహతహల మధ్య స్వామివారి నిజరూప దర్శనానికి ఏర్పాట్లు జరిగిన వేళ, అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కలకలం రేపింది.
మంగళవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షం కారణంగా, సింహగిరి బస్టాండ్ వద్ద కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన రూ.300 టికెట్ క్యూలైన్‌పై ఉన్న సిమెంట్ గోడ కూలి భక్తులపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయాలపాలయ్యారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
సమయస్ఫూర్తిగా స్పందించిన రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సర్వీసు, పోలీసు శాఖల సిబ్బంది సహాయచర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఇంకా కొందరు ఉండే అవకాశాన్ని అధికారులు ఎత్తిచూపుతున్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఈ విషాదకర ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Operation Karregutta: చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న మావోలు
ప్రతి ఏటా వైభవంగా జరిగే శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా ఈసారి కూడా భక్తుల భారీ రద్దీ కనిపించింది. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, వేదపారాయణాల తర్వాత, అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి నిజరూప దర్శనం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
కానీ ఆధ్యాత్మిక శోభను ముసురుకొలిపిన ఈ ప్రమాదం మొత్తం రాష్ట్రాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. భక్తులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం పరిస్థితిని సమర్థంగా సమర్ధించేందుకు కృషి చేస్తోందని హామీ ఇచ్చారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భవిష్యత్ ఉత్సవాల్లో భద్రతాపరంగా మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం అధికారం వర్గాలపై బాద్యతగా నిలిచింది.