Movie News: మూవీ లవర్స్ ముఖ్యంగా హీరోల ఫ్యాన్స్ మధ్యలో ఒకే చర్చ గట్టిగా జరిగేది. మా హీరో సినిమా వందరోజులు ఇన్ని సెంటర్స్.. మా హీరో సినిమా సంవత్సరం ఆడింది తెలుసా? ఇదే కొలమానం హీరోల స్టామినాకి. కానీ, రోజులు మారాయి.. ఒక్కరోజులో ఎంత వచ్చింది.. వారంలో ఎంత వచ్చింది. అంతే.. వారం తరువాత సినిమా ఆడుతుందా లేదా అనేది పెద్దగా అవసరం లేదు.
నచ్చిన హీరో సినిమాను విడుదల రోజు చూడటం ఒక ఎత్తు అయితే… దేవుడిగా భావించే ఆ హీరో మూవీ రన్ గురించి కలలు కనడం, కలత చెందడం మరో ఎత్తు. లాంగ్ రన్ అనే పదాన్ని సినిమా వాళ్ళు మర్చిపోయి చాలా రోజులైంది. వేయి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తున్న సినిమాలు సైతం మూడు నాలుగు వారాలు మించి థియేటర్లలో సందడి చేయడం లేదు. కానీ ఈ యేడాది వచ్చిన కొన్ని సినిమాలు… రన్ విషయంలోనూ అభిమానులలో కొత్త ఆశలు రేపాయి. మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయేమో అనిపించేలా చేశాయి.
Movie News: సినిమా… ఈ మూడక్షరాల పదంతో కొందరు గంగవెర్రులెత్తిపోతారు. సినిమా చూడకుండా కొందరికి వారం గడవదు. కొందరైతే రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక సినిమా చూడకుండా నిద్రకూడాపోరు. సినిమా చూడటం అనే ఈ పిచ్చి ముదిరి కొందరు హీరోలకు వీరాభిమానులుగా మారిపోతుంటారు. ఎంత అభిమానం అంటే… అవతలి హీరోని విపరీతంగా ద్వేషించేంత!? అలాంటి అభిమానులు కారణంగా కొన్ని సినిమాలు జయపజయాలతో నిమిత్తం లేకుండా అత్యధిక రోజులు థియేటర్లలో ప్రదర్శితమౌతుంటాయి. రెండు తరాలకు ముందు వరకూ సినిమా విడుదలైంది అంటే… హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అనే మాట్లాడుకునే వారు. అర్థ శతదినోత్సవం, శతదినోత్సవం, రజతోత్సవం, స్వర్ణోత్సవం అని ఘనంగా చెప్పుకునేవారు. ఈ తరానికి ఆ పదాలే కొత్తగా అనిపిస్తాయి.
ఒకప్పుడు చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ బరిలో చెలరేగి పోయేవి. కొన్ని సినిమాలైతే… పాత రికార్డులను బద్దులు కొట్టాయి. చాలా కాలం తెలుగు సినిమా రంగంలో అగ్రస్థానాన్ని ఎంజాయ్ చేసిన మెగా స్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి నటనకు దూరమయ్యారు. సొంత పార్టీతో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఆయన కలత చెందారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా… సినిమా రంగానికి దూరమై తప్పుచేశాననే భావనకు లోనయ్యారు. దాంతో ‘ఖైదీ నంబర్ 150’తో తిరిగి చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. చిత్రం ఏమంటే… ఈ రీఎంట్రీ టైమ్ కు ‘సినిమా రన్’ అనే మాటను జనం మర్చిపోయారు. దాంతో ‘ఖైదీ నంబర్ 150’ విషయంలోనూ రన్ కంటే… నిర్మాతలు కలెక్షన్స్ ఎంతో చెప్పడానికే ఆసక్తి చూపించారు. అయితే అభిమానుల కోసం అన్నట్టుగా ‘ఖైదీ నెంబర్ 150’ శతదినోత్సవ వేడుకను తిరుపతిలో జరిపారు.
ఇది కూడా చదవండి: Akhil Akkineni: అక్కినేని అఖిల్ నిశ్చితార్థం! వచ్చే యేడాది పెళ్ళి!!
Movie News: సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకున్న సినిమా మరొకటి లేదు. అయితే గత యేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మళ్ళీ ఆయన అభిమానుల్లో ఓ ఊపు తీసుకొచ్చింది. చిరంజీవి ఊర మాస్ పాత్రతో పాటు… మాస్ మహరాజా రవితేజ జత కావడంతో అది ఇంకాస్తంత పీక్స్ కు చేరింది. కలెక్షన్స్ పరంగా చిరంజీవి బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక అభిమానులు ఈ విజయాన్ని అలా వదిలేయలేక ఈ సినిమా ఒకటి రెండు ధియేటర్లలో 175 ఆడించే ప్రయత్నం చేసి… మా సినిమా సిల్వర్ జూబ్లీ ఆడిందనిపించారు.
తెలుగు సినిమా రంగంలో అత్యధికంగా రికార్డులను సొంతం చేసుకున్న సీనియర్ హీరో ఎవరంటే బాలకృష్ణ పేరే చెబుతారు. నెంబర్ ఆఫ్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఉన్న ఏకైక హీరో బాలకృష్ణే. అలానే అత్యధిక రోజులు థియేటర్లలో ప్రదర్శితమైన సినిమా కూడా బాలకృష్ణదే! నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ఇటీవలే నట స్వర్ణోత్సవాన్ని జరుపుకున్నారు బాలకృష్ణ. ఆయన నటించిన ‘లెజెండ్’ మూవీ అత్యధిక రోజులు ప్రదర్శితమైన మూవీగా సౌతిండియాలోనే సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. ఇది ఓ రకంగా న భూతో నభవిష్యతి అనుకోవచ్చు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా 175 రోజుల పాటు ప్రదర్శితమైంది. విశేషం ఏమంటే… ఇదే యేడాది దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ కూడా వందరోజుల పాటు ఆడింది. బాలకృష్ణకు విశేష అభిమాన గణం ఉంది. అందుకే వారు తమ అభిమాన హీరో సినిమాను వందరోజుల పాటు ఏదో ఒక సెంటర్ లో ఆడించాలని చూస్తుంటారు. ఇది మిగిలిన స్టార్ హీరోలకు సాధ్యం కానీ రేర్ ఫీట్.
ఇవాళ్టి యూత్ కు అంతా ఫాస్ట్ గా జరిగిపోవాలి. జీవితం వడ్డించిన విస్తరిలా ఉండాలి. అలాంటి సదుపాయాలను సినిమాలూ చేసేస్తున్నాయి. ఫోన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకునే రోజులు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే హోమ్ థియేటర్లలోనే సినిమాలను చూసుకునే సదుపాయం వచ్చేసింది. అదీ కాదంటే ఎంచక్కా… ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఉండనే ఉన్నాయి.
Movie News: మారిన పరిస్థితుల కారణంగా ఇవాళ థియేటర్లలో జనాల సందడి తగ్గిపోయింది. దాంత్ లాంగ్ రన్ అనే మాట వినిపించడం లేదు. ఇవాళ వినోదం అంటే సినిమా మాత్రమే కాదు… బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక సినిమాను చూసే విధానంలోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడంటే సినిమాను థియేటర్ లోనే చూడాలి. ఆ తర్వాత వీడియో కాసెట్లు వచ్చాయి. వీసీడీలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలూ వచ్చాయి. రెండు మూడు వారాలు ఓపిక పడితే… ఇంట్లో కూర్చుని నచ్చిన సినిమా చూసేయొచ్చు. ఈ నేపథ్యంలో థియేటర్లుకు వెళ్లడం టిక్కెట్ల కోసం కసరత్తులు చేయడం అనేది పోయింది. దాంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ టైమ్ లోనూ రిలీజ్ మూవీస్ నంబర్ తగ్గడం లేదు. అయితే ప్రతి సినిమా ఇలా విడుదలై అలా వెళ్ళిపోతోంది! ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి. ఇలాంటి సినిమాలను రెండో వారంలోనే నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు.
ఇప్పుడు రోజులు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ యేడాది వచ్చిన సినిమాలను చూసినప్పుడు మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయని, సినిమా ఐదారు వారాల పాటు థియేటర్లలో సస్టైన్ అవుతుందనే హోప్ కలుగుతోంది. మరీ… వారం, రెండు వారాలు కాకుండా చిన్న సినిమాలు సైతం నాలుగైదు వారాలు ఆడుతున్న దాఖలాలు కనిపించాయి. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హను-మాన్’ అలాంటి హోప్ నే ఇచ్చింది. చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన టైమ్ లో వచ్చిన ‘హను-మాన్’ ఘన విజయం సాధించడమే కాదు… పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో సందడి చేసింది. ఉత్తరాదినా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
సంక్రాంతి సీజన్ లో వచ్చిన మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ స్టార్ హీరో స్టామినాను తెలియచేసింది. సినిమా కథ, కథనాలు యావరేజ్ గా ఉన్నా… ఆ స్టార్ కు మాస్ లో క్రేజ్ ఉంటే… సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని ‘గుంటూరు కారం’ నిరూపించింది. రన్ తో సంబంధం లేకుండా ‘గుంటూరు కారం’ బెటర్ ఓపెనింగ్స్ తో పాటు బెటర్ కలెక్షన్స్ అందుకుంది. ఈ మ్యాజిక్ నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేశ్ ‘సైంథవ్’ మూవీస్ చేయలేకపోయాయి.
ఇది కూడా చదవండి: Pushpa 2: ‘పుష్ప-2’కు గుమ్మడికాయ కొట్టేశారు!
Movie News: ‘డీజే టిల్లు’తో మ్యాజిక్ చేశాడు యంగ్ హీరో సిద్థు జొన్నలగడ్డ. ఈ సినిమా కమర్షియల్ గా బాగా పే చేయడంతో దానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇలాంటి ఫ్రాంచైజ్ మూవీస్ సక్సెస్ కావాలంటే కథలో దమ్ము ఉండాలి. మేకింగ్ తో మెస్మరైజ్ చేయాలి. ఎందుకంటే ముందు సినిమా సక్సెస్ తాలుకు అంచనాలు, పోలికలు వీటిపై ఉంటాయి. అయితే ‘టిల్లు స్వ్కేర్’ వాటిని రీచ్ అయ్యింది. మంచి రన్ తో ఈ మూవీ నాలుగు వారాలు థియేటర్లలో సందడి చేయడం కూడా చిన్న తెలుగు సినిమాలకు శుభ పరిణామమే!
రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’తో పాటు ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, విక్రమ్ ‘కోబ్రా’, పృథ్వీరాజ్ ‘గోట్ లైఫ్’ వంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అలాంటి సమయంలో జూన్ 14న వచ్చిన ‘మహారాజ’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. డబ్బింగ్ సినిమాలు ఏం చూస్తాంలే అనే నిరాసక్తతో ఉన్న ప్రేక్షకులలో విజయ్ సేతుపతి సినిమా చైతన్యం తీసుకొచ్చింది. స్క్రీన్ ప్లే అంటే ఇలా కదా ఉండాలి! అనేలా చేసింది. ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ వరకూ ఆగి చూడకుండా… జనాలు థియేటర్లలో దీనిని చూశారు. దాంతో ‘మహారాజ’ సైతం ఐదారు వారాలు థియేటర్లలో సందడి చేసింది.
మచ్ అవైటెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ జూన్ నెలాఖరులో విడుదలైంది. విశేషం ఏమంటే కేవలం ఇండియాలోనే కాదు… విదేశాల్లోనూ ఈ సినిమా ప్రదర్శించిన థియేటర్లు జాతరను తలపించాయి. ‘కల్కి’ మూవీ రిలీజ్ ను ప్రభాస్ ఫ్యాన్స్, సగటు ఆడియెన్ పెద్ద ఫెస్టివల్ మాదిరి జరుపుకున్నారు. సినిమా గురించి కొంత నెగెటివ్ టాక్ వినిపించినా… మేకింగ్ తో దర్శకుడు నాగ అశ్విన్ మెస్మరైజ్ చేశాడు. ఆర్టిస్టులు తమ నట విశ్వరూపం చూపించారు. మరీ ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ఆ వయసులో చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చాయి. దాంతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ‘కల్కి’ సినిమా చేరడమే కాదు… థియేటర్లలోనూ వారాల తరబడి ఆడింది. ‘బాహుబలి -2’ తర్వాత మళ్ళీ అంతగా థియేట్రికల్ రన్ కలిగిన ప్రభాస్ సినిమా ఇదే! తెలుగులోనే కాకుండా హిందీలోనూ, తమిళంలోనూ ఈ సినిమా అనేక కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో వంద రోజులకు నోచుకోలేదు. విశేషం ఏమంటే… కేవలం బుక్ మై షో లోనే 1.32 కోట్ల టిక్కెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా ‘కల్కి 2898 ఎ.డి.’ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
Movie News: ఈ యేడాది ప్రథమార్థంలో వచ్చిన కొన్ని సినిమాలు థియేట్రికల్ రన్ విషయంలో కొత్త ఆశలు చిగురింప చేశాయి. అదే ఒరవడి ద్వితీయార్థంలోనూ కనిపించింది. సినిమా కాస్తంత బాగుంటే… థియేటర్లకు జనాలు వెళతారని, చిన్న సినిమాలైనా ఆదరిస్తారని రుజువైంది. అందుకు ‘కమిటీ కుర్రోళ్ళు ఓ ఉదాహరణగా నిలిచింది.
నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు. దాదాపు 40 మంది కొత్తవాళ్ళతో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదలైంది. యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. పెద్దంత అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఊహించని సందడి చేసింది. విమర్శకులకు సైతం అంతుచిక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి జనాలు సిద్థమయ్యారు. అందుకే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సైతం నింపాదిగానే జరిగింది. అలా జనాలను ఆకట్టుకున్న మరో సినిమా సైతం అదే నెలలో ఆగస్ట్ 15న వచ్చింది. నార్నే నితిన్ హీరోగా నటించిన ‘ఆయ్’ సినిమా కూడా థియేటర్లలో మూడు నాలుగు వారాలు బాగానే ఆడింది. దాంతో ఈ రెండు సినిమాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడూ మంచి ఆదరణ లభించింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ థియేటర్లలో దుమ్ము రేపింది. ఆస్కార్ విజేతగానూ నిలిచింది. దాని తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ‘దేవర -1’ చిత్రం సెప్టెంబర్ 27న జనం ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది. కానీ మేన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ను ‘దేవర’గా మెస్మరైజ్ చేశాడు. నెగెటివిటీని నిదానంగా జయించుకుంటూ థియేటర్లలో బలంగా నిలబడ్డాడు. ఆ సమయంలో మరే పెద్ద సినిమా లేకపోవడంతో ‘దేవర’ మూడు నాలుగు వారాల పాటు బాగా ఆడింది. ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ కాస్తంత తగ్గాయి. ఈ మధ్య కాలంలో అర్థ శతదినోత్సవం అంటూ థియేటర్ల జాబితాతో పోస్టర్ వేసింది ‘దేవర’ సినిమాకే.
Movie News: ద్వితీయార్థంలో వచ్చిన డబ్బింగ్ సినిమాలకూ పెద్దంత ఆదరణ లభించలేదు. ఇందులో ధనుష్ ‘రాయన్’తో పాటు, విజయ్ ‘గోట్’ కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో దీపావళి కానుకగా వచ్చిన శివ కార్తికేయన్ ‘అమరన్’ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసింది. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరద రాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ పొందింది. దేశం కోసం అశువులు బాసిన ఈ ఆర్మీ ఆఫీసర్ కు ప్రేక్షకులు సరైన రీతిలో నివాళులు అర్పించారు. ముకుంద్ గా శివ కార్తికేయన్, అతని భార్యగా సాయిపల్లవి ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ పేట్రియాటిక్ మూవీ తమిళంలోనే కాదు… తెలుగులోనూ చక్కని ఆదరణ పొందింది. నాలుగు వారాలు గడిచినా…. ఇప్పటికీ థియేటర్లలో ఈ మూవీ ఆడుతోందంటే… దానికి లభిస్తున్న ఆదరణను అంచనావేసుకోవచ్చు.
దీపావళికే వచ్చిన మరో సినిమా ‘లక్కీ భాస్కర్’. ఇది తెలుగులో దుల్కర్ సల్మాన్ కు హాట్రిక్ మూవీ. ‘మహానటి, సీతారామం’ తర్వాత దుల్కర్ నటించిన ఈ సినిమా కూడా విశేష ఆదరణ పొందింది. విశేషం ఏమంటే తెలుగులో అతను చేసిన మూడు సినిమాలూ పీరియాడికల్సే! ‘మహానటి’ మూవీ సావిత్రి బయోపిక్ కాగా, ‘సీతారామం’ ఇండో పాక్ వార్ నేపథ్యంలో జరిగే కథ. ఇక ‘లక్కీ భాస్కర్’ నాలుగు దశాబ్దాల క్రితం బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లను తెలిపేది. ఆర్థిక వ్యవహారాలపై తీసిన సినిమాలు జనాలకు కనెక్ట్ కావడం కష్టం కానీ దర్శకుడు వెంకీ అట్లూరి దానిని సులభంగా అర్థమయ్యేలా తీయడంతో ‘లక్కీ భాస్కర్’కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడమే కాకుండా… నాలుగు వారాలుగా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.
వీటితో పాటు రెండు మూడు వారాలు ఆడిన సినిమాలూ మూడు నాలుగు ఈ యేడాది వచ్చాయి. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లలో బాగానే ఆడింది. అలానే దానికి ముందు వచ్చిన కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన ‘మత్తు వదలరా -2’ బాగానే కలెక్షన్స్ రాబట్టి అతని ఖాతాలో మరో హిట్ ను వేసింది. ఇక కిరణ్ అబ్బవరం మూవీ ‘క’ దీపావళికే విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మాస్ ఆడియెన్స్ నూ ఈ సినిమా ఓ మేరకు మెప్పించింది. దాంతో మూడు వారాల పాటు థియేటర్లలో ఉంది. ఈ నెల 22ను ‘క’ మలయాళ వర్షన్ ను దుల్కర్ సల్మానే కేరళలో రిలీజ్ చేశారు.
Movie News: ఈ యేడాది కమర్షియల్ సక్సెస్ ను సాధించిన సినిమాలు థియేటర్లలో కూడా ఐదారు వారాల పాటు ఆడటం శుభ పరిణామం. భారీ బడ్జెట్ చిత్రాలను అత్యధిక థియేటర్లో విడుదల చేస్తారు. దాంతో అవి రెండు మూడు వారాల్లో పెట్టుబడిని సంపాదించేస్తాయి. కానీ చిన్న సినిమాల కథ వేరు. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి.. జనాలు థియేటర్లకు వచ్చే వరకూ అవి నిలదొక్కుకోవాలి. అలాంటి సంఘటనలూ ఈ యేడాది జరిగాయి. దానికి తోడు డిసెంబర్ మాసం… మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్క-2’తో మొదలు కాబోతోంది. సో… ‘కల్కి’ తరహాలోనే థియేటర్లు షేక్ కావడం ఖాయం!
‘కల్కి’ సినిమా విడుదల సమయానికి అది ఎలా ఉంటుందో జనాలకు పెద్దంత అవగాహన లేదు. అలాంటి సినిమానే థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకుంది. కానీ ‘పుష్ప’ సినిమా గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప-2’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్సే వెయ్యి కోట్లు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఐదు కాదు ఆరు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించడంతో పాటు…. లాంగ్ రన్ కూ ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 5 నుండి జనవరిలో సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకూ ‘పుష్ప-2’కు తిరుగు ఉండదని అంటున్నారు. ఆ రకంగా ఐదు వారాల పాటు థియేటర్లలో ‘పుష్ప-2’ సందడి ఖాయంగా కనిపిస్తోంది.
ఈ యేడాది చివరి వారంలో వచ్చే సినిమాలను సైతం తక్కువ అంచనా వేయడానికి లేదు. హాలీవుడ్ మూవీ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తో పాటు నితిన్ ‘రాబిన్ హుడ్’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’, అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, వెన్నెల కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాలు క్రిస్మస్ కానుకగా వస్తున్నాయి. ఇవి ఏ మాత్రం జనాలను ఆకట్టుకున్నా… మూడు, నాలుగు వారాలు ఎన్నో కొన్ని థియేటర్లలో ఏదో రీతిన ఆడే ఆస్కారం ఉంది.
ఇవాళ స్టార్ హీరోల సినిమాలు అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్నాయి కాబట్టి వాటి లాంగ్ రన్ ను కోరుకోకూడదు. అలానే చిన్న సినిమాలు సైతం ఎంత బాగున్నా… నెల రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి కాబట్టి అవి కనీసం అర్థ శతదినోత్సవం జరుపుకోవాలని అనుకోవడం అర్థరహితమే అవుతుంది. థియేటర్ల కు వచ్చి సినిమా చూడాలనుకునే వారికి టిక్కెట్ రేట్లతో పాటు మల్టీప్లెక్స్ లోని స్నాక్స్ రేట్లు భారంగా మారుతున్నాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాటూ జనాలు లేక షో పడుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో విజయం సాధించిన సినిమాలు కనీసం నాలుగైదు వారాలైనా థియేటర్లలో ఆడుతుంటే… ఆ కళ వేరు. థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యమైన ఈ రోజుల్లో శతదినోత్సవాలు, రజతోత్సవాలను ఆశించకపోయినా… ప్రతి మంచి సినిమా మూడు, నాలుగు వారాలైనా ఆడాలనుకోవడం అత్యశ కాకపోవచ్చు.
డిసెంబర్ లో వచ్చే సినిమాలు బాగా పే చేసి సక్సెస్ సాధిస్తే… న్యూ ఇయర్ లోకి మరింత ఉత్సాహంగా అడుగు పెట్టొచ్చు. ఎలానూ సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ మూవీస్ ఉండనే ఉన్నాయి. సో … అన్ని మంచి శకునములే అనుకుంటూ ముందు సాగుద