Jharkhand: శ్రావణ మాస కావడి యాత్రకు వెళ్తున్న భక్తులను మృత్యువు కబళించింది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలో ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటన మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా వద్ద జరిగింది. బాబా వైద్యనాథ్ ధామ్ ఆలయంలో జలాభిషేకం చేసిన అనంతరం, భక్తులతో నిండిన ఒక బస్సు దుమ్కాలోని వాసుకినాథ్ ఆలయానికి వెళ్తుండగా, దారిలో ఎల్‌పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, ఐదుగురు భక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
స్థానిక ఎంపీ నిషికాంత్ దూబే ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో 18 మంది భక్తులు మరణించినట్లు ధృవీకరించారు. ఇది తన లోక్‌సభ నియోజకవర్గమైన దేవ్‌ఘర్‌లో జరిగిన విషాదమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఈ బాధను తట్టుకునే శక్తిని బాబా వైద్యనాథ్ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
Also Read: Quantam Vally vs Fishery: చికెన్ కొట్లు, చేపల చెరువు దగ్గరే ఆగిపోయిన వైసీపీ బ్రెయిన్స్
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పరిపాలనా అధికారులు, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను తక్షణమే ప్రారంభించి, గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో ప్రయాణిస్తున్న భక్తులందరూ బీహార్‌లోని బెట్టియా, గయా ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. శ్రావణ మాసం కావడంతో కన్వర్ యాత్రలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ ఘటన భక్తుల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.