PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ నెల (జూలై) 23 నుంచి 26వ తేదీ వరకు ప్రధాని ఆయా దేశాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో జరిగే వివిధ దౌత్యపరమైన చర్చలు, ఒప్పందాల్లో ఆయా దేశాల అధికారులతో ప్రధాని పాల్గొంటారు. ఈ మేరకు ఒప్పందాలపై ప్రధాని సంతకం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
PM Modi: తొలుత భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందంపై జరిగే చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ఆ ఒప్పందాలపై సంతకం చేయనున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో బ్రిటన్ ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య చర్చలు కూడా జరపనున్నారు. ఆ తర్వాత 25, 26 తేదీల్లో ప్రధాని మోదీ మాల్దీవులు దేశంలో పర్యటిస్తారు.
PM Modi: మాల్డీవుల 60వ జాతీయ దినోత్సవానికి భారత ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, గతంలో ప్రధాని మోదీపై ఆ దేశ మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దౌత్యపరంగా విభేదాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో మాల్దీవులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఓ దశలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయింది. ఈ ప్రభావంతో మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య తగ్గింది.
PM Modi: పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాల్దీవుల దేశానికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయితే ఈ దశలో ప్రధాని మోదీ పర్యటనతో దెబ్బతిన్న దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగవుతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ దేశవాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.