Operation Sindoor: భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రాకుండా ఉండాలని సూచించింది. అలాగే, జమ్మూ నగరంలో కూడా శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. ఈ దాడి తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్‌ను పంపగా, భారత భద్రతా బలగాలు దాన్ని కూల్చివేశాయి.
Also Read: India-Pakistan conflict: భారత్-పాక్ ఘర్షణ.. ఆ యుద్ధంలో జోక్యం చేసుకోబోమన్న అమెరికా ఉపాధ్యక్షుడు
Operation Sindoor: భారత్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021లో జమ్మూలోని వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. అయితే, ఈ తరహా దాడులను అడ్డుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. సాఫ్ట్‌కిల్, హార్డ్‌కిల్ విధానాలను ఉపయోగించి డ్రోన్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.