mlc kavita: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని ఆమె అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే పంచాయితీ ఎన్నికలు జరగాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే, ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
బీసీల హక్కులను కాపాడేందుకు ప్రతి వార్డులో వందల నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డి నుంచి బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే నామినేషన్లను అంగీకరిస్తామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ, జూలై రెండో వారానికి లోపు ఆమోదం లభించకపోతే జూలై 17 నుంచి రైలు రోకోలు చేపడతామని హెచ్చరించారు.
అలాగే, ఏపీ రూపొందిస్తున్న గోదావరి-బనకచర్ల లింక్, బొల్లాపల్లి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆపరేషన్ కగార్ విషయంలో కూడా కవిత స్పందించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రం ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఎన్కౌంటర్లు అమానవీయ చర్యలని, తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం చేశారు.