Hyderabad: సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడి చేతిలో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు అలియాస్ రాజు అనే వ్యక్తి గత కొన్నేళ్ల నుండి కర్మన్ ఘాట్ లోని జానకి ఎన్‌క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి వివాహం అయిన కొన్ని రోజుల నుంచి భార్య అతనికి దూరంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటూ డైలీ ఫైనాన్స్ ఇచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మామిడి గురువమ్మ అనే మహిళ భర్త మృతి చెందడంతో తన కుమారుడు, కుమార్తె తో కలిసి కర్మన్ ఘాట్ లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో గత పది నెలలుగా వెంకటేశ్వర్లు గురువమ్మతో కలిసి జానకి ఎన్ క్లేవ్ లో సహజీవనం చేస్తున్నాడు. గురువమ్మ తన కుమారుడు, కుమార్తెను మరోచోట అద్దె ఇంట్లో ఉంచింది.
Also Read: Crime News: స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త.. ఎందుకంటే..?
ఉగాది పండుగ ఉండడంతో కుమారుడు, కుమార్తె లు తన తల్లి గురువమ్మ ఉండే జానకి ఎన్ క్లేవ్ కు వచ్చారు. వెంకటేశ్వర్లు గురువమ్మను ఆమె కొడుకు, కూతురిని ప్రతిరోజూ అసభ్యకరమైన పదాలతో తిట్టేవాడు. వెంకటేశ్వర్లు గురువమ్మ, కుమారుడు పవన్ ముగ్గురి మధ్య గొడవ జరిగింది.
వెంకటేశ్వర్లు పోలీసులకు ఫోన్ చేసి పవన్ తనను కొడుతున్నాడని చెప్పాడు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి పవన్ కత్తితో దాడి చేసి వెంకటేశ్వర్లు ఎడమ భుజం, కడుపు, ఛాతీపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులు గాయపడిన వెంకటేశ్వర్లును వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సైదిరెడ్డి తెలిపారు.