Karnataka: అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ శిక్ష ఖరారుపై కోర్టులో బోరున విలపించారు. తనకు తక్కువ శిక్ష విధించాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నారు. నిన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన వెంటనే ఆయన కన్నీళ్లపాలు అయ్యారు. ఇంట్లో పనిచేసే మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ప్రజ్వల్ దోషిగా నిర్ధారితమయ్యారు. కొద్ది సేపట్లో ఆయనకు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.
ఈ కేసుకు సంబంధించి, కర్ణాటకలోని కేఆర్ నగర్‌కు చెందిన బాధిత మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ కేసు నమోదైన తర్వాత ప్రజ్వల్‌పై మరికొన్ని లైంగికదాడి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రజ్వల్ మొబైల్ ఫోన్‌లో 2,000కు పైగా అసభ్య వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో చాలావరకు ఆయన స్వయంగా రికార్డ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఫలితాల సమయానికి ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. అనంతరం కుటుంబ సభ్యుల సూచనతో ఆయన తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ 14 నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానం ఆయనకు ఎంత శిక్ష విధిస్తుందన్నది సమయం చెప్పాల్సిన విషయమే.