Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం (ఆగస్టు 26) అల్పపీడనం ఏర్పడింది. ఇది 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనాన్ని కలిగి ఉండగా, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. తూర్పు-ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే రెండు, మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో శేర్లింగంపల్లి, రామచంద్రపురం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు, ముషీరాబాద్, ఖైరతాబాద్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: World Smallest Ganesh Idol: ప్రపంచంలోనే అతి చిన్న వినాయక విగ్రహం.. ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు..!
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు – మత్స్యకారులకు హెచ్చరిక
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో 11.17 సెంటీమీటర్లు, నరసన్నపేటలో 10.42 సెంటీమీటర్లు, ఆమదాలవలసలో 8.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా మొత్తం మీద 65 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది.
విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం ప్రకారం బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు శనివారం వరకు సముద్ర వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబర్ భద్రతా సూచిక ఎగురవేయబడింది.
ప్రభుత్వాలు అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పరిస్థితిని సమీక్షిస్తూ అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కూడా అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
👉 మొత్తంగా, వచ్చే 48 గంటలు రెండు రాష్ట్రాల ప్రజలు వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కోస్తా ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.