ఇంఫాల్: మేఘాలయలో భారీ వర్షాలకు వరదలు విధ్వంసం సృష్టించాయి. గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వర్షాల కారణంగా10 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పశ్చిమ గారో హిల్స్‌లోని దాలు ప్రాంతం, సౌత్ గారో హిల్స్‌లోని గసుపరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలతో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక, ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గసువాపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాలుకు చెందిన ముగ్గురు, హతియాసియా సాంగ్మా గ్రామానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. వరదలపై స్పందించిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ప్రజలు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వరద పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కూలిపోయిన చెక్క వంతెనలను పునరుద్దరించేందుకు బెయిలీ బ్రిడ్జి టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం అధికారులకు సూచించారు. బాధిత ప్రజలను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్-గ్రేషియా అందజేయాలని చెప్పారు. మరోవైపు, ముంపుకు గురైన గ్రామాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్యూ ఆపరేషన్ చేపట్టాయి. ముంపు బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.