EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా, ఆ ప్రయాణికుడు “విమానాన్ని బాంబుతో పేల్చేస్తానంటూ” కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ సంఘటన ఈజీజెట్ విమానం EZY609లో జరిగింది. లండన్ లూటన్ విమానాశ్రయం నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగరిన కొంతసేపటికి 41 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి అకస్మాత్తుగా అరిచాడు. అతను “నా దగ్గర బాంబు ఉంది, నేను విమానాన్ని పేల్చేస్తాను” అని కేకలు వేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా, “డెత్ టూ అమెరికా, డెత్ టూ ట్రంప్” అంటూ నినాదాలు చేస్తూ, “అల్లాహు అక్బర్” అని కూడా అరిచాడు.
దీంతో విమానంలో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. కొంతమంది ప్రయాణికులు మొదట అతను జోక్ చేస్తున్నాడని భావించినప్పటికీ, అతని దూకుడు ప్రవర్తనతో పరిస్థితి తీవ్రతను గ్రహించారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక ప్రయాణికుడు అతన్ని కిందపడేసి అదుపు చేయడం, మిగిలిన వారు సహాయం చేయడం కనిపిస్తుంది.
Also Read: Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం
ఈ పరిణామాల నేపథ్యంలో, విమానం అత్యవసర ల్యాండింగ్‌కు సిద్ధమైంది. గ్లాస్గో విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కౌంటర్-టెర్రరిజం అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అతని ఉద్దేశ్యం ఏమిటి, అతని నేపథ్యం ఏమిటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈజీజెట్ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ, విమానం, ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
‘DEATH to Trump’ and ‘ALLAHU AKBAR’ — man causes panic on flight
Says he’s going to ‘BOMB the plane’
SLAMMED to ground by passenger pic.twitter.com/mVYwXqx7Yr
— RT (@RT_com) July 27, 2025