BCCI: గత సంవత్సరం వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ బహుమతిని ప్రకటించింది. ఏకంగా రూ. 125 కోట్ల నగదు బహుమానంతో పాటు ఇప్పుడు మరో విలువైన బహుమతిని కూడా అందించింది. ఆ ప్రపంచ కప్ ఆడిన జట్టులోని ప్రతి ఆటగాడికి విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ నుండి స్ఫూర్తి పొంది తీసుకుంది.
బీసీసీఐ నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వజ్రపు ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఆటగాళ్లకు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. “టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టుకు ఛాంపియన్స్ రింగ్ ను ప్రదానం చేస్తున్నాం. ఈ వజ్రాలు శాశ్వతంగా ఉండినా, ఈ విజయం మాత్రం బిలియన్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి” అని బీసీసీఐ ప్రకటించింది.
ఈ ఉంగరాలు వజ్రాలు, బంగారంతో తయారు చేయబడ్డాయి. ఉంగరంపై టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలు, అశోక చక్రం గుర్తు ఉంటాయి. ఇంకా ఉంగరం యొక్క రెండు పక్కలా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లు, భారత జట్టు విజయాలు సాధించిన తేడాలు ముద్రించబడ్డాయి.
ఇది కూడా చదవండి: Basketball: అరుదైన రికార్డును 40 ఏళ్ల వయస్సులో కొల్లగొట్టిన బాస్కెట్ బాల్ లెజెండ్..!
వీడియోలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య వీటిని స్వీకరించినట్లు కనిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ లాంటి ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ నుండి స్ఫూర్తి పొంది ఈ ఛాంపియన్స్ రింగ్ కల్చర్‌ను ప్రారంభించింది బీసీసీఐ. ఎన్‌బీఏ తమ ఛాంపియన్లకు రింగ్స్‌ను ఇవ్వడం 1947 నుండి ఆచరిస్తోంది. ప్రతి సీజన్‌లో సూపర్ బౌల్ విజేతలకు కూడా ప్రత్యేకమైన రింగ్స్‌ను అందిస్తారు.