Rajagopal Reddy

Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి యూటర్న్‌ వెనుక మతలబ్ ఏంటి?

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి గేర్ మార్చారు. మంత్రివర్గ విస్తరణలో తన పేరు ఉందన్న చర్చ… ఆపై జరిగిన పరిణామాల తర్వాత అగ్రెసివ్‌గా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాటలు సీఎంకు డైరెక్ట్‌గా తగిలేలా ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉంటారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మంత్రుల సాక్షిగా ఆ వ్యాఖ్యలు చేశారంటే… వారికి తెలిసే జరిగిందా? లేదంటే యాదృచ్ఛికంగా వచ్చాయా? అన్న రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. కాగా, రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మిగతా సీనియర్‌లు పెద్దగా సీరియస్‌గా తీసుకోకున్నా… పొలిటికల్ సర్కిల్‌లో మాత్రం కొత్త ప్రచారం తెరపైకి వచ్చినట్లయింది. కొందరైతే రాజ్‌గోపాల్‌కు మంత్రి పదవి దక్కడం లేదన్న అక్కసును వెళ్లగక్కారని చర్చించుకుంటున్నారు.

ఇటీవల రాజ్‌గోపాల్ రెడ్డి ఓ సమావేశంలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డిపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపుల్ల వేశాడని ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కాడు. ఆ పెద్దాయన ధర్మరాజు పాత్ర పోషిస్తాడనుకుంటే… దుర్యోధనుడు అవతారమెత్తాడని సెటైర్‌ల మీద సెటైర్‌లు పేల్చాడు. అయితే, రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పెద్దాయన జానారెడ్డి పెద్దగా పట్టించుకోలేదు కానీ… అధిష్ఠానం మాత్రం సీరియస్‌గానే రియాక్ట్ అయి, మరోసారి అలాంటి కామెంట్స్ చేయొద్దని చురకలు అంటించినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఇష్యూ మరువక ముందే నల్గొండలో మళ్లీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కాడు.

నల్గొండలో కలెక్టరేట్ భవనం అదనపు గదుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి విమర్శలు, అదే సమయంలో మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలపై పొగడ్తల వర్షం కురిపించాడు రాజ్‌గోపాల్ రెడ్డి. ప్రతిపక్షంపై విమర్శలు సహజం కానీ… సొంత పార్టీ నేతలపై పొగడ్తలే ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేశాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో కొన్నాళ్లుగా సోదరుడు వెంకట్ రెడ్డితో సైతం గ్యాప్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు రాజ్‌గోపాల్ రెడ్డి.

Also Read: Pakistan: వరుసగా 10వ రోజు రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్తాన్.. గుణపాఠం చెప్పిన భారత్

Rajagopal Reddy: ఇటు ఉత్తమ్‌తో ఆయన ఏనాడూ అంత సఖ్యతగా ఉన్నదీ లేదు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్నపుడు చాలాసార్లు ఉత్తమ్‌పై ఓపెన్‌గా విమర్శలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ భువనగిరిలో జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ అని సంబోధించకుండా సీఎం అనడం చర్చనీయాంశంగా మారింది. ఇక నల్గొండ మీటింగ్‌లో ఒక్కసారిగా జిల్లా మంత్రులను భుజాలమీద ఎత్తుకున్నారు రాజ్‌గోపాల్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు అన్ని విషయాలపై అవగాహన ఉందనీ… పాలనలో అత్యంత సమర్థవంతులనీ ఇద్దర్నీ తెగ పొగిడేశారు. అంతేనా, అంతటితో ఊరుకున్నారా? ఈ ఇద్దరూ సీఎం పదవికి అర్హులని… వారికి ఆ యోగ్యత ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ  Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు

మొత్తానికి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కేడర్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఉత్తమ్, వెంకట్ రెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హులు అంటే… ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనర్హుడనా అంటున్నారు కొందరు లీడర్స్. మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోతే ఇంకా ఎన్ని హాట్ కామెంట్స్ వినాల్సి వస్తుందోనని… స్వపక్షంలో విపక్షంగా మారడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *