Mangalagiri IT sector: మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి నారా లోకేష్ నేతృత్వంలో.!! కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తొలి ఏడాదిలోనే మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు టీడీపీ యువనేత. పాలనలో తన మార్క్ చూపిస్తున్న లోకేష్, మంగళగిరి నియోజకవర్గంపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 90 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందించిన మంగళగిరి ప్రజల రుణం తీర్చుకునే విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్రంలో మరో నియోజకవర్గంలో జరగని విధంగా అభివృద్ధి పనులకు మంగళగిరిలో శ్రీకారం చుట్టారు నారా లోకేష్. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో 3 వేల మంది నిరుపేదలకు వారి సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇళ్ల పట్టాలు అందచేసిన లోకేష్, మరోసారి మంగళగిరి ప్రజలకు భారీ స్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మరో 2 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని అందచేయటానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక, మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2 వేల మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అనుక్షణం ప్రయత్నం చేస్తున్నారు లోకేష్.
ఆగస్టులో మరో 2 వేల పట్టాలు మంగళగిరిలో ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని మరికొందరు నిరుపేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. 10 వేలకు పైగా టిడ్కో ఇళ్లను చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. అత్యంత వేగంగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా, మంగళగిరిలోని ప్రస్తుత టిడ్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంటీఎంసీ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు ఉండాలన్నారు. అదేవిధంగా, మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సీఎస్ఆర్, ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానవాటికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇక, వరద నివారణకు మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటు సమాంతరంగా సుందరమైన పార్కును కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే మంగళగిరి శివాలయం పక్కన అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోడల్ లైబ్రరీ పనులు తుది దశకు చేరుకున్నాయి.
Also Read: PM Narendra Modi: ప్రధానిగా ఇందిర రికార్డును అధిగమించిన మోదీ.. మరికొన్ని రికార్డులు ఆయన సొంతం
రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్ లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బృహత్ ప్రణాళికను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మంగళగిరిలో స్మార్ట్ స్ట్రీట్ బజార్, నిడమర్రు రోడ్డులో 350 షాపులతో అధునాతన మార్కెట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మంగళగిరిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాగలనని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇలా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజల కోర్కెలను తీర్చేందుకు తరచూ అధికారులతో రివ్యూ మీటింగ్‌ల ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాకుండా స్పష్టమైన ఆదేశాలను ఇస్తున్నారు.
మరో కీలక విషయం ఏంటంటే.. మంగళగిరిలో ఐటీ అభివృద్ధికి సైతం అడుగులు పడుతున్నాయి. పలు ఐటీ కంపెనీలు మంగళగిరిలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా.. 50 వేలకు పైగా ఐటీ ఉద్యోగాల రూపకల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీల ప్రతినిధులు తమ ఆలోచనలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మంగళగిరి కేంద్రంగా ఐటీ సెక్టర్‌ను అభివృద్ధి చేయడం వల్ల రాజధాని అభివృద్ధిలో అది కూడా కీలకమవుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఐటీ కంపెనీలతో పాటు నాన్-ఐటీ కంపెనీల ఏర్పాటుపైనా నారా లోకేష్ దృష్టి పెట్టారు. మొత్తానికి మంగళగిరి అభివృద్ధి విషయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.