Maoist party: కరోనా వైరస్ మావోయిస్టు పార్టీకి కంటిపై కునుకులేకుండా చేసిన తరుణంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీకి ఓ వైపు వరుస ఎన్‌కౌంటర్లు, మరో వైపు కీలక నేతల లొంగుబాట్లు పార్టీకి తీవ్రనష్టాన్ని మిగిలుస్తున్నాయి. అటు ఛత్తీస్‌గఢ్‌లో లాన్‌వర్రాట్, ఇటు మహారాష్ట్ర, తెలంగాణలో ఇంటికి రండి కుటుంబ సభ్యులతో జీవించండి అని పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల నుంచి అనేక మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారు.దీంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ముందు వరకు మావోయిస్టు పార్టీ అటు ఛత్తీస్‌గఢ్…
Maoist party: ఇటు తెలంగాణలో పటిష్ఠంగా ఉండేది. అయితే కరోనా వైరస్ అడవుల్లో కూడా వ్యాప్తి చెందడంతో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారు.వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు హరిభూషణ్, భారతక్క ఉన్నారు. అంతే కాదు ఏడాది కాలంలో అనేక మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లల్లో మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల్లో ఏడాది కాలంలో సుమారు 300 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇలా వరుస ఘటనలు మావోయిస్టు పార్టీకి పట్టున్న రాష్ట్రాల్లోని అనేక మంది మావోయిస్టులను పార్టీకి దూరం చేశాయి. పార్టీని నడిపించే నాయకులే చనిపోతుండడంతో దళ సభ్యులు కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: YCP Party: వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్
Maoist party: లొంగుబాట్లు కూడా మావోయిస్టు పార్టీని ఖాళీ చేయిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు తీసుకొచ్చిన లాల్‌వర్రాట్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది.వందల మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంత మంది ఆరోగ్యం సహకరించకపోవడంతో లొంగిపోయారు.అలాగే తెలంగాణలో కూడా ఇంటికి రండి కుటుంబ సభ్యులతో జీవించండి అంటూ పోలీసులు తీసుకొచ్చిన కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది.ఇప్పటికే ఆయా జిల్లాల్లో అనేక మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.
Maoist party: సంవత్సరం మొదటి రోజే మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తాకిందని చెప్పవచ్చు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న మల్లోజుల కోటేశ్వర్ రావు, మల్లోజుల వేణుగోపాల్ అన్నదమ్ములు. కోటేశ్వర్ రావు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో మృతి చెందారు. ఆయన సోదరుడు వేణు గోపాల్ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. తారక్క1983లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: Keeravani: ఇళయరాజా స్వరరచన, కీరవాణి గీత రచన
Maoist party: 170కిపైగా కేసులు ఉన్న ఆమెపై రూ. కోటికిపైగా రివార్డు ఉంది. సిడాం విమల చంద్ర అలియాస్ తారక్క అలియాస్ వత్సల పీపుల్స్ వార్ నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 1986లో గడ్చిరోలి జిల్లా అహేరి LOS మెంబర్‌గా, 1987లో పెరిమెలి ఏరియాలో, 1994 నుంచి ACM హోదా, LOS కమాండర్‌గా పని చేశారు.భామ్రఘడ్ కమాండర్‌గా, ఏరియా కమిటీ సెక్రటరీగా, 2006లో సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలిగా, 2010 నుంచి 9వ కంపెనీలో పని చేసిన ఆమె 2018లో రాహీ ఏరియాలో పని చేశారు. ఇటీవలే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు.అలాగే డికె వైద్య బృందానికి ఇన్‌ఛార్జీగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఓ వైపు వరుస ఎన్ కౌంటర్లు, మరో వైపు లొంగుబాట్లతో మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.చూడాలి మరి మావోల దిద్దుబాటు చర్యలు ఏవిధంగా ఉంటాయో.
రచియిత
లక్కాకుల శ్రీనివాస్
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా