KNL District TDP President: తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఈ దిశగా కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా అధ్యక్ష ఎంపిక కోసం అభిప్రాయ సేకరణకు అధిష్ఠానం సిద్ధమైంది. త్రీ మెన్ కమిటీ సభ్యులు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆశావహుల జాబితా అధిష్ఠానానికి చేరినట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాలతో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా 11 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, మిత్రపక్షం బీజేపీ ఘనవిజయం సాధించాయి. 2004 తర్వాత 20 ఏళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం సాధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిన నేపథ్యంలో, మరో ఏడాదిన్నరలో మున్సిపాలిటీ, జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కమిటీల ఎంపికపై చంద్రబాబు, లోకేష్ దృష్టి సారించారు.
Also Read: BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కేంద్రమంత్రి.. ఎవరంటే?
కర్నూలు పార్లమెంట్ పార్టీ కమిటీ, జిల్లా అధ్యక్ష ఎంపిక కోసం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబులతో కూడిన త్రీ మెన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ రేపు కర్నూలు వచ్చి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తుంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి తిక్కారెడ్డి కొనసాగుతున్నారు. అయితే, తిక్కారెడ్డిని కొనసాగిస్తారా లేదా కొత్త నాయకుడికి అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి లిస్టు చూస్తే.. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కర్నూలు సిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఆకేపోగు ప్రభాకర్, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్ గౌడ్, ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ వాయి హుస్సేన్ పోటీలో ఉన్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవులు పొందినవారికి పార్టీ పదవులు ఇవ్వకపోతే, ఇతరులకు అవకాశం దక్కే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు జిల్లా అధ్యక్ష పీఠం ఆశిస్తున్న ఆశావాహులు ఎంపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది.
త్రీ మెన్ కమిటీ సేకరించిన అభిప్రాయాల ఆధారంగా చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుని, జిల్లా అధ్యక్షుడు, 34 మందితో కూడిన కార్యవర్గం, అనుబంధ సంఘాలను వచ్చే నెల 3వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపిక జిల్లాలో టీడీపీ బలోపేతానికి కీలకంగా మారనుంది.