Anitha: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,”పొగాకు రైతుల వద్దకు వెళ్లి జగన్ కేజీకి, టన్నుకి తేడా తెలియకుండా మాట్లాడారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తొక్కించిన ఘనత జగన్‌కే దక్కుతుంది,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అనిత ఆగ్రహంతో చెబుతూ, “రైతుల సమస్యలను రాజకీయం చేయకూడదు. కానీ వైసీపీ నేతలు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు,” అని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, “రైతు కుటుంబాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కానీ వైసీపీ నేతలు ఎల్లప్పుడూ ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారు,” అని విమర్శించారు.
తాజాగా చేపట్టిన భూసర్వే గురించి వివరించిన మంత్రి అనిత, “రీసర్వే ద్వారా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రైతులు సాంకేతికతను వినియోగించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి,” అంటూ సూచనలు చేశారు.