Anil ravipudi: ఇటీవల ఇండస్ట్రీలో ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై దర్శకుడు అనిల్ రావిపూడి తన స్పందనను తెలియజేశారు. తన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయోత్సవ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు.
“మీ నిర్మాత దిల్ రాజు ఐటీ దాడుల కారణంగా బాధలో ఉంటే, మీరు సక్సెస్ మీట్ చేస్తున్నారా?” అని ఓ విలేకరి సరదాగా అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపూడి నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
“మా సినిమా టైటిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కదా. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో. దిల్ రాజు బాధలో లేరు. ఒక్క ఆయన పైనే కాకుండా, ఇండస్ట్రీలో చాలా మందిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాను వచ్చినా రాకపోయినా, ఈ సినిమా ప్రమోషన్ ఆపొద్దని దిల్ రాజు మాకు చెప్పారు. ఈ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని ఆయన సూచించారు. అందుకే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసాం. ఐటీ దాడులు అనేవి ఒక ప్రాసెస్‌లో భాగమే. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరగడం సర్వసాధారణం. ఇది ఇండస్ట్రీలో, బిజినెస్ రంగంలో సహజమే,” అని అనిల్ అన్నారు.
“సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉందా?” అని మరో ప్రశ్నకు సమాధానంగా అనిల్ చమత్కరించారు. “నేను సుకుమార్ ఇంటి పక్కన లేను. ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి, ఐటీ వారు మా ఇంటికీ రావచ్చు,” అని నవ్వుతూ చెప్పారు.
ఇకపోతే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి పండుగకు భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూ, పలు నాన్ పాన్-ఇండియా సినిమాల రికార్డులను తిరగరాసింది. అనిల్ రావిపూడి తనదైన శైలిలో హాస్యాన్ని పండించి ప్రేక్షకులను ఆకర్షించడంలో మరోసారి విజయం సాధించారు. పండగ సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.