Theft: అనంతపురం జిల్లాలో కూతురు పెళ్లి కోసం దాచిన ఆస్తులు దోచుకెళ్లిన ఘోర చోరీ చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న విల్లాల్లో జరిగింది. వెంకట శివారెడ్డి అనే వ్యక్తి తన కుమార్తె ఫిబ్రవరిలో జరగబోయే పెళ్లి కోసం రూ. 20 లక్షల నగదుతో పాటు రూ. 3.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను లాకర్‌లో ఉంచాడు.
పెళ్లి కార్డులు బంధువులకు ఇచ్చేందుకు ఇతర ప్రాంతానికి వెళ్లిన సమయంలో, దొంగలు ఇంట్లో చొరబడి లాకర్‌ను పగులగొట్టారు. లాకర్‌లో ఉన్న నగదు, బంగారం, వజ్రాలను దోచుకెళ్లారు. ఇంటి వాచ్‌మెన్ సమాచారం అందించడంతో వెంటనే ఇంటికి చేరుకున్న బాధితుడు, లాకర్ పగిలి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, నలుగురు దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. అంతకు ముందు, అదే ప్రాంతంలోని మరో రెండు ఇళ్లలోనూ దొంగలు చోరీలకు పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం స్థానికులలో భద్రతాపై ఆందోళన నెలకొంది. పోలీసులు దొంగలను త్వరగా పట్టుకుని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.