Telangana Aarogyasri: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా ఒకప్పుడు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసాయం అందుబాటులో ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలకు పెంచి మరింత బలపరిచింది. దీంతో అనేక మంది పేదలకు ప్రాణరక్షణ లభించింది.
అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. గత ఏడాది రోజులుగా ప్రభుత్వ బకాయిలు చెల్లింపులు జరగకపోవడంతో ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆగష్టు చివరి నాటికి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. సమాచారం ప్రకారం, ఆస్పత్రులకు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే (2025 జనవరి 10) ఆసుపత్రులు ఈ విషయంపై ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు
బిల్లులు క్లియర్ కాని పరిస్థితిలో, ఆసుపత్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చర్చలద్వారా లేదా బకాయిల చెల్లింపులద్వారా సమస్యను పరిష్కరించకపోతే, ఆగష్టు చివరి నుండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఖాయం.
ఈ పరిణామం పేదలకు పెద్ద దెబ్బగా మారనుంది. ఆరోగ్యశ్రీ ఆధారంగా చికిత్స పొందుతున్న వేలాది మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇకపై ప్రభుత్వం చురుకుగా స్పందించి, ఆస్పత్రుల బకాయిలను తీర్చడం ద్వారా పథకాన్ని కొనసాగించనుందా లేదా అన్నది చూడాలి