Bhatti vikramarka: ప్రత్యేక తెలంగాణను నీళ్ల కోసం సాధించామని గుర్తుచేసిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే నిర్మించబడిందని తీవ్ర విమర్శలు చేశారు. కమిషన్ రిపోర్టుపై పారదర్శకంగా చర్చ జరగాలని కోరుతూ, సభలో చర్చను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ, కట్టిన పది రోజుల్లోనే ప్రాజెక్టు సమస్యలు తలెత్తడాన్ని ప్రజలు ఆవేదనగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
జస్టిస్ ఘోష్ రిపోర్టుపై మాత్రమే తాము మాట్లాడామని, రాజకీయ ఆరోపణలు లేవని భట్టి స్పష్టం చేశారు. హరీష్ రావు జస్టిస్ ఘోష్‌పై కూడా అనవసర అపవాదులు వేస్తున్నారని విమర్శించారు. “కక్ష సాధింపు ఉంటే అప్పుడే చర్యలు తీసుకునేవాళ్లం” అని వ్యాఖ్యానించారు.
కనీసం కేబినెట్ అప్రూవల్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, NDSA ఇచ్చిన సూచనలను కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్పినా, హరీష్ రావు కట్టినా చివరికి బాధపడింది మాత్రం ప్రజలేనని భట్టి తెలిపారు.
రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును ముక్కలుగా చేసి, ఒక్క ఎకరానికి కూడా అదనపు నీళ్లు ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల నిర్మాణాలు పనికిరాకుండా పోయాయని, హరీష్ రావు కూడా కాళేశ్వరం లాగానే కుంగిపోయారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.