AP Rains: ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2025: గణపతి బప్పా మోరియా’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా..?
తీరం వెంట గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారుల సూచనలు వచ్చాయి. వినాయక మండపాల నిర్వాహకులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడలో వర్ష బీభత్సం
విజయవాడ నగరంలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు రహదారులు జలమయమై, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు వీఎంసీ సిబ్బంది ట్యాంకర్ల సాయంతో చర్యలు చేపడుతున్నారు.
ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 1,37,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు 69 గేట్లు ఎత్తి లక్షన్నర క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.