Surrogacy Racket: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాల ఘటన మరువక ముందే ఈ కొత్త దందా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ వ్యవహారంలో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ అక్రమ సరోగసీ ముఠాకు ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి (45), ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి (23) నాయకత్వం వహిస్తున్నారు. ఈ ముఠా పేద యువతులను లక్ష్యంగా చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపించి సరోగసీ (అద్దె గర్భం), అండాల దానానికి ఒప్పిస్తోంది.
ఈ ముఠా సరోగసీకి అంగీకరించిన మహిళలతో ప్రామిసరీ బాండ్లను రాయించుకుంటోంది. బిడ్డను కని ఇచ్చే సరోగసీ తల్లికి కేవలం ₹4-5 లక్షలు మాత్రమే ఇస్తామని ఒప్పందం చేసుకుని, సంతానం కోరుకునే తల్లిదండ్రుల నుంచి మాత్రం ₹20-25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Crime News: హైదరాబాద్‌లో దారుణం: ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య
నిందితురాలు లక్ష్మికి గతంలో కూడా ఇలాంటి కేసుల్లోనే నేర చరిత్ర ఉంది. గతంలో పిల్లల విక్రయాల కేసులో ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె తన పద్ధతి మార్చుకోకుండా హైదరాబాద్‌లో మళ్ళీ ఇదే దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆమె కుమారుడు, కుమార్తె కూడా పాలుపంచుకుంటున్నారని వెల్లడించారు.
పోలీసులు లక్ష్మి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భాధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు లభించాయి. అలాగే, వివిధ ఐవీఎఫ్ (IVF) సెంటర్లకు వచ్చిన దంపతుల వివరాలను ఏజెంట్ల ద్వారా లక్ష్మి సేకరిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. హెగ్డే హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్‌లతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.