Summer: గ్రీష్మ కాలం మొదలైన వేళ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల మార్కును దాటిన వేడి, వడగాలుల ప్రభావం పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తాకిడి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 167 మండలాల్లో మోస్తరు వడగాలులు నమోదయ్యాయి.
ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు:
కర్నూలు – 40.6 డిగ్రీలు
నందిగామ – 40 డిగ్రీలు
అనంతపురం – 39.2 డిగ్రీలు
ఎన్టీఆర్ జిల్లా – 38.21 డిగ్రీలు
వడదెబ్బ ప్రభావంతో వీటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భగ్గుమంటూ ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకున్నాయి.
తెలంగాణలో ముఖ్య ప్రాంతాల ఉష్ణోగ్రతలు:
ఆదిలాబాద్ – 40.6 డిగ్రీలు
కొమురంభీం – 40.5 డిగ్రీలు
భద్రాద్రి – 40.1 డిగ్రీలు
మెదక్ – 39.6 డిగ్రీలు
వనపర్తి – 39.7 డిగ్రీలు
ఈ ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
వచ్చే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు
మితంగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.మధ్యాహ్నం గరిష్ట వేళలో బయటకు వెళ్లకూడదు.మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి.శరీరానికి తేమ తగ్గకుండా నీటిని పుష్కలంగా తీసుకోవాలి. పొడవాటి ప్రయాణాలు వీలైనంతవరకు తగ్గించుకోవాలి
రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.