Nepal: హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండు సార్లు ప్రకంపనలు సంభవించాయి. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఖఠ్మండూతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో భూకంపం సంభవించింది. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. అనంతరం షిజాంగ్ ప్రాంతంలో మరో రెండు సార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7, 4.9గా నమోదైనట్టు తెలిపారు.
ఈ భూకంప తీవ్రత ఉత్తర భారత దేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగాల్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రకంపణలు నమోదయ్యాయి. బీహార్‌లో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.
టిబెట్‌లోని షిగెట్స్ పట్టణంలో గత ఐదేండ్లలో 29 సార్లు భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత 3 లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవని, 200 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంతో పోల్చితే ఇవన్నీ తక్కువ తీవ్రత కలిగినవని వెల్లడించారు.