Ys sharmila: డీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి

Ys sharmila: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరుపై లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారి భావోద్వేగాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు పలు సూచనలు చేస్తూ, నిరుద్యోగుల పట్ల కనికరం చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పరీక్షకు కేవలం 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. “ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ” అని అభ్యర్థులు వాపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. “45 రోజుల్లో పూర్తి సిలబస్ చదవడం సాధ్యపడదని, కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు” అని ఆమె వివరించారు.

“మూడున్నర లక్షల మంది అభ్యర్థులు మీరు చేపడుతున్న విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు లేఖలు రాసినా స్పందించకపోవడం, నిరుద్యోగుల బాధల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృష్టకరం” అని షర్మిల విమర్శించారు.

డీఎస్సీ వాయిదా వేయాలని కోరడాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించిన మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల, “ఇది ఆయన తొందరపాటు నిర్ణయానికి అద్దం పడుతుంది” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, పరీక్ష రాయబోయే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని షర్మిల తెలిపారు. “90 పాఠ్యపుస్తకాలను 45 రోజుల్లో చదవడం సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించాలి. కనీసం మరో 45 రోజులు ప్రిపరేషన్ గడువు పెంచే విషయంపై తక్షణమే పునరాలోచించాలి” అని ఆమె అన్నారు.

ఇక పరీక్ష విధానంపై కూడా అభ్యర్థులు సూచనలు చేస్తున్నారని, నార్మలైజేషన్ పద్ధతికి బదులుగా ఒకే జిల్లా, ఒకే ప్రశ్నాపత్రం విధానాన్ని తీసుకొస్తే మెరుగైన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని షర్మిల పేర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆమె కోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *