Deadly Song: సంగీతం అనేది మనిషి జీవితంలో అనివార్యమైన భాగం. హృదయాన్ని హత్తుకునే స్వరాలు మనసును ప్రశాంతం చేస్తాయి. అందుకే పెద్దలు “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” అని అన్నారు. మధురమైన సంగీతం మనసుకు ఆనందాన్నిస్తే, కొన్ని పాటలు మాత్రం విరహం, దుఃఖం, విచారం వంటి భావాలను పెంచుతాయి. అయితే ఒక పాట విన్నవారు ప్రాణాలు తీసుకున్నంతటి భయంకర చరిత్ర కలిగి ఉందని తెలుసా? అదే ‘గ్లూమీ సండే’ (Gloomy Sunday) పాట. ఈ పాటను చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన పాటగా పరిగణిస్తారు.
పాట పుట్టుక వెనుక దుఃఖకథ
1933లో హంగేరీకి చెందిన సంగీతకారుడు రెజ్సో సెరెస్ (Rezső Seress) ఈ పాటను రచించాడు. ఆ సమయంలో అతను తీవ్రమైన ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాడు. ఈ పాటకు గీతాలను లాజ్లో యావోర్ (László Jávor) రాశాడు. 1935లో విడుదలైన ఈ పాట, అప్పటి ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఒత్తిడి వంటి పరిస్థితులను ప్రతిబింబించింది.
పాట విన్నవారిలోఆత్మహత్యల వరద
పాట విడుదలైన కొద్దికాలానికే బుడాపెస్ట్‌లో ఒక చెప్పుల కుట్టేవాడు ఆత్మహత్య చేసుకుని, తన సూసైడ్ నోట్‌లో ఈ పాట పంక్తులను రాశాడు. అదే సమయంలో రచయిత రెజ్సో కాబోయే భార్య కూడా విషం తాగి ప్రాణాలు తీసుకుంది. తర్వాత పాట విన్న ఇద్దరు వ్యక్తులు కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఓ మహిళ నదిలోకి దూకింది. ఈ సంఘటనలతో పాటను వినడానికి ప్రజల్లో భయాందోళన పెరిగి, దీన్ని 62 సంవత్సరాల పాటు నిషేధించారు.
పాటలోని సాహిత్యం ఏమిటి?
ఈ పాటలో మానవ జీవితంలోని విషాదం, మరణం, నిరాశ గురించి గీతాలు ఉన్నాయి. అప్పటి పరిస్థితుల్లో నిరుద్యోగం, పేదరికం, ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రజలు ఈ పాటను తమ జీవితానికి అన్వయించుకుని మరింత నిరాశలో మునిగిపోయారు.
రచయిత స్వయంగా ఆత్మహత్య
1968లో రెజ్సో సెరెస్ స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం ఈ పాట చుట్టూ ఉన్న భయంకర వాస్తవాలను మరింత గాఢం చేసింది. ఈ పాటను విన్నవారిలో 100 మందికి పైగా ప్రాణాలు వదిలారని చరిత్ర చెబుతుంది.
నిషేధం ఎత్తివేత
ఈ పాటపై నిషేధం 2003లో ఎత్తివేయబడింది. కానీ ‘గ్లూమీ సండే’ ఇప్పటికీ “సూసైడ్ సాంగ్” పేరుతో భయంకర చరిత్రను గుర్తు చేస్తుంది.
సంగీతం శక్తి – ఓ ఆలోచన
సంగీతం మనసును మలచే శక్తి కలిగింది. అది మధురంగా ఉంటే మనసుకు శాంతి, ఉత్సాహం ఇస్తుంది. కానీ కొన్ని పాటలు మనసును దిగులు లోనికి నెడతాయి. ‘గ్లూమీ సండే’ పాట ఈ విషయానికి ఉదాహరణ. కాబట్టి సంగీతాన్ని వినేటప్పుడు కూడా మనసుకు ఆనందం ఇచ్చే స్వరాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం.