Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకున్న దారుణం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రియుడి మోజులో పడి, భర్తను కూతురుని కిరాతకంగా హత్య చేసిన మహిళ కవిత హంతకురాలుగా బయటపడింది. సమాచారం ప్రకారం, కవిత భర్త కుమారస్వామి అనారోగ్యంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు రాజ్‌కుమార్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం గురించి భర్తకు తెలియకముందే, జూన్ 25న కూతురు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి సహకారంతో భర్త గొంతు నులిమి చంపి, సహజ మరణమని బంధువులకు నమ్మించింది.
ఇంతటితో ఆగిపోలేదు. తండ్రి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన పెద్ద కూతురు వర్షిణి తన తల్లిని ప్రశ్నించడంతో అసలు రహస్యం బయటపడే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో కవిత, రాజ్‌కుమార్ సహాయంతో వర్షిణిని గొంతు నులిమి హత్య చేసింది. మృతదేహాన్ని సంచిలో కట్టి గ్రామ శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక చెట్లపొదల్లో పడేసింది.
యూట్యూబ్‌లో వీడియోస్ చూసి మర్డర్ స్కెచ్ వేశారు, ఆగస్టు 6న పోలీస్ స్టేషన్‌లో కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు వెతుకుతున్నప్పటికీ, ఆగస్టు 25న మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాటారం సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసారు. అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ పెట్టి క్షుద్రపూజల ముసుగులో నేరాన్ని దాచే ప్రయత్నం చేశారు.
Also Read: Crime News: కొంప ముంచిన రీల్స్.. రెండో భార్యతో ఇన్‌స్టా రీల్స్.. తాటతీసిన ఫస్ట్ వైఫ్
ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మొదట యువతి మృతదేహం వద్ద క్షుద్రపూజ ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు బలిపూజ అనుకున్నారు. కానీ, పోలీసులు లోతుగా విచారణ జరిపి తప్పుదోవ పట్టించేలా వేసిన నాటకాన్ని బయటపెట్టారు. టెక్నాలజీ ఆధారంగా సేకరించిన ఆధారాలతో కవిత, రాజ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన ఎస్పీ కిరణ్ కారే, ఈ కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు. భర్తను హతమార్చి సహజ మరణమని నమ్మించి, తర్వాత అనుమానం వ్యక్తం చేసిన కన్నకూతురినే చంపిన ఈ ఘటన “సినిమా కథను తలపించేలా” ఉందని పోలీసులు పేర్కొన్నారు.