IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ గా మళ్లీ విరాట్ కోహ్లీ..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా?, ఈ విషయంపై ఇప్పటికే ఫ్రాంఛైజీ, కోహ్లీ మధ్య చర్చ జరిగిందా?, ఐపీఎల్ 2025 నుంచి కోహ్లీనే ఆర్సీబీ కెప్టెన్‌గా ఉంటాడా?, అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ రిటెన్షన్‌ లిస్ట్ ఇచ్చేందుకు మరికొన్ని గంటలే ఉండటంతో.. కోహ్లీ మరోసారి ఆర్సీబీ పగ్గాలు అందుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. గడిచిన మూడు సీజన్‌లుగా ఫాఫ్ డుప్లిసిస్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు 40 ఏళ్లు. దీంతో అతడిని రిటైన్ చేసుకోవడానికి ఆర్సీబీ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఐపీఎల్‌ ప్రారంభం నాటి నుంచి ఆడుతున్నప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దీంతో ఈసారి మెగా వేలంలో పక్కా ప్లాన్‌లను అమలు చేసి.. టైటిల్ అందించే ఆటగాళ్లతో బలంగా మారాలని ఆ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్‌ను వదులుకునే యోచనలో ఉన్నట్లు ఆర్సీబీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాను చివరి ఐపీఎల్ మ్యాచ్‌ కూడా ఇదే జట్టు తరఫున ఆడతానని ఇదివరకే చెప్పేశాడు. ఇక ఈ రన్ మెషీన్ 2013 నుంచి 2021 వరకు బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో నాలుగు సార్లు జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ముఖ్యంగా 2016లో జట్టును తుది మెట్టు వరకు తీసుకెళ్లాడు. కానీ, అనూహ్యంగా సన్ రైజర్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్పు కల నెరవేరలేదు.దీంతో 2021లో బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీకి కెప్టెన్ అవసరం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కోహ్లీ.. మేనేజ్‌మెంట్ అభ్యర్థన మేరకు మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాస్తవానికి కోహ్లీ అధికారికంగా కెప్టెన్ కానప్పటికీ.. ఫాఫ్ డుప్లెసిస్‌కి అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చాడు. దీంతో అతడే మళ్లీ కెప్టెన్ కావాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కొన్ని రోజులుగా పట్టుబడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *