Virat Kohli: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అధికమవుతున్న వేళ, నియంత్రణ రేఖ వెంట సైనిక కదలికలు, క్షిపణి ముప్పులు, వైమానిక దాడుల హెచ్చరికలు భారతదేశంలోని సరిహద్దు నగరాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భద్రతా పరిరక్షణ కారణాల చేత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టోర్నమెంట్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న భారత సాయుధ దళాల పట్ల ప్రముఖ క్రికెటర్లు తమ కృతజ్ఞతలు తెలిపారు. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో, “మన దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల ధైర్యానికి, వారి కుటుంబాల త్యాగానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాం. మేము మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం,” అని పోస్ట్ చేశారు.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “మనల్ని రక్షించేందుకు సైన్యం చేస్తున్న విశేష సేవలకు మనఃపూర్వక ధన్యవాదాలు. వారి ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం” అని అన్నారు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. “సరిహద్దుల్లోని మన సైనిక బలగాల అంకితభావం, ధైర్యం నన్నెంతో గర్వపెడుతోంది. మీరు చూపుతున్న బలమే మాకు భద్రత కలిగిస్తోంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్!” అని పేర్కొన్నారు.
ఇంతకుముందు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల సేవలను ప్రశంసిస్తూ, ప్రజలంతా ఒక్కటిగా నిలిచి నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా దేశ భద్రతకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.