Rammohan Naidu: విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రీ కేఫ్‌ను’ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు సోమవారం ప్రారంభించారు. సామాన్య ప్రయాణికులకు విమానాశ్రయాలలో తక్కువ ధరకే ఆహారం, పానీయాలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ కేఫ్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
కేఫ్‌లో ₹10కే ఆహారం, పానీయాలు..
విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఉడాన్ యాత్రీ కేఫ్‌లో ఆహారం, పానీయాలు (బేవరేజ్‌లు) కేవలం రూ. 10/- నుంచే లభిస్తాయని మంత్రి రామ్మోహన్నాయుడు ప్రకటించారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉంటాయనే ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రతి సామాన్య ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆయన వివరించారు.
కేఫ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం, మంత్రి రామ్మోహన్నాయుడు స్వయంగా ప్రయాణికులకు కాఫీని అందించి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి చేతుల మీదుగా కాఫీ అందుకోవడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఈ ‘ఉడాన్ యాత్రీ కేఫ్‌ను’ ముంబై విమానాశ్రయంలో తొలిసారి ప్రారంభించగా, అక్కడ లభించిన అనూహ్య స్పందనతో ఇప్పుడు గన్నవరంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
Also Read: Bandi sanjay: కార్యకర్తలకి సర్పంచ్ టికెట్లు.. బండి కీలక వ్యాఖ్యలు
దేశంలో పెరిగిన విమానాశ్రయాలు
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు దేశంలో విమానయాన రంగం సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే చిన్న పట్టణాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ అందించగలిగామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానాల్లో ప్రయాణించే అవకాశం ఏర్పడిందని మంత్రి వివరించారు.
కేఫ్ ప్రారంభోత్సవం అనంతరం, ‘అమ్మ పేరుతో ఒక చెట్టు’ అనే కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్నాయుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. విమానాశ్రయం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) కేశినేని శివనాథ్ (చిన్ని) తో పాటు విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ రోజు (సోమవారం) విజయవాడలో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారిని కూడా ఆయన దర్శించుకునే అవకాశం ఉంది. ఈ రోజు మూల నక్షత్రం, అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇవ్వడంతో ఆలయానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.