Tirumala: నిత్యకల్యాణం, పచ్చతోరణానికి తిరుమల ఆలయం ప్రతీక అంటారు. అలాంటి పరమ పవిత్రతతో కూడుకున్న ఆలయం సూర్య, చంద్రగ్రహణాల వేళ వేద పండితుల సూచనల మేరకు తాత్కాలికంగా మూసి ఉంచుతారు. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆరోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి వేయనున్నట్టు ఆ ప్రకటనలో టీటీడీ తెలిపింది.
మళ్లీ సెప్టెంబర్ 8వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలతో యథావిధిగా నిత్య పూజలు చేస్తారు. దీంతో 8వ తేదీన ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిని ఇస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.