Manchu Family: నిజంగానే అంతులేని కథలా మారింది మంచు ఫ్యామిలీ గొడవ. ఇప్పటికే చాలాసార్లు కుటుంబ వ్యవహారాల్ని వీధికెక్కించి రచ్చ చేసుకున్న మంచు ఫ్యామిలీ.. మధ్యలో కొంత కాలం సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా.. తాజాగా మళ్ళీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ లో మంగళవారం మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం మళ్ళీ మంచి ఫ్యామిలీని వీధిలోకి తీసుకువచ్చింది. తాను ఇంట్లో లేనపుడు తన కార్లతో పాటు పలు వస్తువులను మంచు విష్ణు దొంగిలించాడంటూ మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా జల్ పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకెళ్లడమే కాకుండా విలువైన వస్తువలను అన్నిటిని పగులగొట్టే విధ్వంసం సృష్టించారని మనోజ్ పోలీసులకు చెప్పారు. దీనికంతకీ కారణం తన సోదరుడు మంచు విష్ణు అని ఆయన ఆరోపించారు.
మంచు విష్ణు చేసిన పనులపై.. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడటానికి ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.
మొత్తంగా చూసుకుంటే.. కొద్దిరోజుల పాటు అంతా సర్దుకున్నట్టు కనిపించిన మంచు ఫ్యామిలీ ఇష్యు ఇప్పుడు మళ్ళీ రాజుకున్నట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్ ఫిర్యాదుపై విష్ణు, మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.