Telangana News: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఈ పరిణామానికి దారితీసే అవకాశం ఉన్నది. ఈ మేరకు గత కొన్నాళ్లుగా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నది. బుధవారం (మార్చి 12) నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇదేరోజు సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు నోటీసులు జారీ అయ్యాయి.
Telangana News: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై విచారణ జరిపి ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఆ నోటీసులకు ఇదే నెల (మార్చి) 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని స్పీకర్‌కు పంపిన నోటీసులో సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. దీనిపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎలాంటి జవాబు పంపుతారోననే విషయం ఆసక్తిగా మారింది.
Telangana News: 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోర్టులను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ సుప్రీంకోర్టుదాకా వెళ్లింది.
Telangana News: తొలుత బీఆర్ఎస్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ఇదే సందర్భంలో అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిందిగా స్పీకర్ కార్యాలయానికి కోర్టు నోటీసులను జారీచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఆశించినట్టుగా తీర్పు రాకపోవడంతో వెంటనే కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందతో కూడా కేసులను దాఖలు చేయించారు.
Telangana News: ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణ జరిగింది. చర్యలు తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటిలోగా గడువు కావాలో తేల్చి చెప్పాలని కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రతివాదులను డిమాండ్ చేసింది. ఈ దశలోనే తాజాగా ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే నోటీసులు జారీ చేయడంపై ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చినట్టయింది.
Telangana News: సుప్రీంకోర్టు నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పీకర్ స్పందించకపోయినా, లేదా శాసనవ్యవస్థ అధికారాల్లోకి న్యాయవ్యవస్థ రావద్దనే విషయాన్ని గుర్తుచేస్తూ నోటీసులకు సమాధానం ఇచ్చినా సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో అనే అంశంపైనా క్యూరియాసిటీ నెలకొన్నది.