ఈ విస్తరణలో ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం గమనార్హం. దీనివల్ల కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. కాంగ్రెస్ గెలుచుకున్న ఏడు బీసీ ఎమ్మెల్యేలలో ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. ఇది కాంగ్రెస్ పాలనలో సామాజిక సమీకరణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
ఇది కూడా చదవండి: KCR: మాగంటి భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్
ఇక శాసన సభ ఉప సభాపతి పదవికి తొలిసారిగా డోర్నకల్ నుంచి గెలిచిన రామచంద్రునాయక్‌ను నియమించారు. ఆయన ఎస్టీ లంబాడా వర్గానికి చెందినవారు. ఈ మేరకు ఎస్టీ ఆదివాసీలకు ఇప్పటికే మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు మరో కీలక పదవి లభించడమే విశేషం. అయితే ఈసారి విస్తరణలో రెడ్డి వర్గానికి మాత్రం ఎలాంటి ప్రాతినిధ్యం లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా ఈ కేబినెట్ విస్తరణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, సమతుల్యత దిశగా మరో అడుగు వేశారు. పార్టీ అధిష్టానం కూడా ఈసారి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నైక సుదర్శన్ రెడ్డి వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా తాత్కాలికంగా వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది.