Brutal Murder: తమిళనాడు మధురైలో బీజేపీ మహిళా నేత శరణ్యపై జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు తల నరికి హత్య చేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు గుండెలవిసేలా షాక్‌కు గురయ్యారు. మహిళా రాజకీయ నేతపై ఇలా కిరాతకంగా దాడి జరగడం స్థానికంగా భయాందోళనలు, ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.
శరణ్య గతంలో వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. 2023లో తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మధురై పర్యటనలో ఉన్నప్పుడు, ఆయన కారుపై చెప్పులు విసిరిన ఘటనలో ప్రధాన పాత్రధారిగా నిలిచారు. ఆ సంఘటనలో ఆమెతో పాటు మరికొంతమంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచే ఆమెపై రాజకీయ ప్రత్యర్థులు కక్ష పెంచుకున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: కులగణనపై మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ..
ఈ హత్య రాజకీయంగా ప్రేరితమైందా లేక వ్యక్తిగత విభేదాల ఫలితమా అన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ విచారణ కొనసాగిస్తున్నారు. మధురై పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. అలాగే శరణ్యకి ఉన్న వ్యక్తిగత మరియు రాజకీయ సంబంధాలపైనా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇక బీజేపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేయాలని, హంతకులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒక మహిళా నేతను నడిరోడ్డుపై ఇలా దారుణంగా హతమార్చడం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నార్థకం వేసింది. ప్రస్తుతం ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ ఉత్కంఠను సృష్టించడంతో పాటు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.